Silver Price: వెండి ధరలు పాతాళానికి..! చరిత్ర చెప్తున్న చేదు నిజం.. మార్కెట్ మాయాజాలం వెనుక ఉన్న అసలు నిజాలివే..
వెండి ధరలు ఎప్పుడూ ఒక మిస్టరీనే.. ఆర్థిక వ్యవస్థలో అలజడి మొదలైనప్పుడల్లా ఆకాశమే హద్దుగా దూసుకుపోయే వెండి.. అంతే వేగంగా పాతాళానికి పడిపోవడం దాని చరిత్ర. తాజాగా జనవరి 29న ఏకంగా 934శాతం లాభాలను పంచిన వెండి.. మరుక్షణమే భారీ పతనానికి గురై ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. గత చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతుందా? అనేది తెలుసుకుందాం..

పెట్టుబడిదారుల నమ్మకానికి, ఆర్థిక భయానికి మధ్య వెండి ఎప్పుడూ ఒక యుద్ధ భూమిలాగే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే వెండి, ద్రవ్యోల్బణం, అప్పుల భయం మొదలవ్వగానే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. చరిత్రను పరిశీలిస్తే.. వెండి ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే దారుణంగా కుప్పకూలుతుందని స్పష్టమవుతోంది. తాజాగా జనవరి 29న వెండి మార్కెట్ మరోసారి చరిత్రను సృష్టించింది. కనిష్ట స్థాయిల నుండి ఏకంగా 934 రాబడిని అందిస్తూ వెండి ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ఈ గరిష్ట స్థాయి వద్ద ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి రావడంతో కేవలం కొన్ని గంటల్లోనే ధర 84 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న.. ఈ పతనం ఎక్కడి వరకు వెళ్తుంది?
చరిత్ర ఏం చెబుతోంది..?
వెండి గతంలో కూడా ఇలాంటి బూమ్ అండ్ బస్ట్ సైకిల్స్‌ను చూసింది:
1970-1980 కాలం
1975లో కేవలం 3.8 డాలర్ల వద్ద ఉన్న వెండి, చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా 1980 నాటికి 50 డాలర్లకి చేరింది. అంటే దాదాపు 1,188 శాతం పెరుగుదల. కానీ అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో వెండి మెరుపు కోల్పోయి ఏకంగా 89 శాతం పడిపోయింది.
2001-2011 కాలం
2001లో 4 డాలర్ల వద్ద ఉన్న వెండి 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత 2011 నాటికి 50 డాలర్లకి చేరింది. కానీ పరిస్థితులు చక్కబడగానే అది మళ్ళీ 72 శాతం మేర పతనమైంది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
సాంకేతిక చార్ట్‌ల ప్రకారం.. వెండి ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. చరిత్ర పునరావృతమై, ప్రస్తుత పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువలపై నమ్మకం తగ్గినప్పుడు వెండి పెరుగుతుంది. అయితే గరిష్ట స్థాయిల వద్ద కొనుగోలు చేసిన వారు చరిత్రలో జరిగినట్లుగా 70-90శాతం క్షీణత సంభవిస్తే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. వెండి కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది మార్కెట్ భయానికి సూచిక. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో, సాంకేతిక చార్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
