Nadendla Manohar: “పబ్లిసిటీ తప్ప ఆడబిడ్డలకు రక్షణ ఏది..?”.. రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన ఫైర్
దేశమంతా 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చేసుకుంటున్న వేళ.. బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై దాడి చేసి హతమార్చడం అత్యంత...
దేశమంతా 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చేసుకుంటున్న వేళ.. బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై దాడి చేసి హతమార్చడం అత్యంత బాధాకరమన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆ యువతి కుటుంబానికి జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తరచూ విద్యార్థినులు, యువతులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్న మాట నూటికి నూరుపాళ్ళు నిజమన్నారు. దిశా చట్టం చేశాం, దిశా యాప్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప.. ఆడబిడ్డలకు మాత్రం రక్షణ ఇవ్వలేకపోయారని చెప్పారు. ప్రచారం కోసం చేసిన చట్టాల వల్ల రక్షణ ఎక్కడ దొరుకుతుంది? అని ప్రశ్నించారు. డొల్ల చట్టాలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని.. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/jMp6JTPRny
— JanaSena Party (@JanaSenaParty) August 15, 2021
అసలేం జరిగిందంటే…
ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రమ్య గుంటూరు కాకాణి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తోంది. అటుగా వచ్చి ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని కోరాడు. అందుకు రమ్య నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. సహనం కోల్పోయి వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి రమ్య చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. అయితే రమ్యను హత్య చేసింది శశికృష్ణగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్యకు ముందు 8నిమిషాలు రమ్యతో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగి, హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Also Read: రమ్య హత్యపై సీఎం జగన్ సీరియస్.. వెంటనే చర్యలకు ఆదేశం.. యువతి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం