ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలంటున్న సీఎం జగన్
ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలంటున్నారు సీఎం జగన్. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్... ప్రైవేట్ సెక్టార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రైవేట్ సెక్టార్‌లో 6లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 386 ఎంవోయూలు చేసుకున్నామని, వాటి ద్వారా 13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నట్టు చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతి భారీ ప్రాజెక్టుల ద్వారా 69వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి, 86వేల ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు. పారిశ్రామిక రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు జగన్. పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలో మాత్రమే ఉన్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఏర్పాటైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్. మరో 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్, కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులో సిగాచి ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయోఇథనాల్ యూనిట్లను ప్రారంభించారు. 1072కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ పరిశ్రమలతో 21వేల 79మందికి ఉపాధి లభించబోతోందని చెప్పారు.
పారిశుద్ధ్య కార్మికుల కోసం కొత్తగా వంద క్లీనింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ వాక్యూమ్ సక్షన్ మెషినరీని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. ఎంపికచేసిన లబ్ధిదారులకు ఈ మురుగుశుద్ధి వాహనాలను అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…