Andhra Pradesh: కేబినెట్‌లో దక్కని ప్రాతినిధ్యం.. సీనియర్లను దూరం పెట్టిన చంద్రబాబు.. అందుకేనా..?
విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, 2014 - 2019 సమయంలో విశాఖకు తగిన ప్రాధాన్యతనే ఇచ్చింది. ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలన్నీ విశాఖలో నిర్వహించే ప్రయత్నం చేసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నుంచే ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సముచిత స్థానం లభించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజధాని అమరావతి అయినప్పటికీ విశాఖకు ఉండే ప్రాధాన్యతలో ఏమాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చన్నదీ అందరి అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం, 2014 – 2019 సమయంలో విశాఖకు తగిన ప్రాధాన్యతనే ఇచ్చింది. ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలన్నీ విశాఖలో నిర్వహించే ప్రయత్నం చేసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నుంచే ప్రారంభించింది. సో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంపైన రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా నిర్వహణ కష్టతరమవుతుందన్న భావంలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే విశాఖపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేస్తామంటూ ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలను ప్రారంభించే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇలాంటి ఆరోపణలు నేరుగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదే నేపద్యంలో విశాఖ మీద ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించకపోవడంపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది
బెర్త్ ఆశించిన అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా..!
విశాఖ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. అందులో ప్రాధాన్యత గల ముఖ్యమైన నేతలు చాలా మంది ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీని సాధించిన నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విశాఖ జిల్లాకే చెందిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ యాదవ్ కి 95 వేల రికార్డు స్థాయి మెజారిటీ లభించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ ఇదే. ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ఒకసారి గాజువాక ఎమ్మెల్యేగా పని చేశారు. పార్టీ విధేయుడుగా గుర్తింపు పొందారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో ఆమరణ దీక్ష లాంటి ఆందోళన కార్యక్రమాలు చేసి స్థానికంగా బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశించారు.
గంటాకు ఖాయమని ప్రచారం..!
అదే సమయంలో అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు. గంటాకు ఇది వరుసగా ఆరోవ విజయం. మొదటిసారి 1999లో అనకాపల్లి ఎంపీగా ఆ తర్వాత చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ తిరిగి మళ్ళీ భీమిలి నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి , 2014లో చంద్రబాబు మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవము ఉంది. దానికి తోడు ఈ ప్రాంతంలో కీలక నేత కావడంతో కచ్చితంగా గంటాకు మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెట్టుకున్నారు. అలాంటి ప్రచారం కూడా జరిగింది. కానీ గంటా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పాలి.. చివరికి గంటా శ్రీనివాసరావుకు నిరాశ మిగిలింది.
ఇదిలావుంటే, గంటా విషయంలో అధిష్టానానికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించినప్పుడు.. దాన్ని పార్టీతో సంబంధం లేకుండా స్వాగతించారు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో కూడా పార్టీ అనుమతి లేకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కూడా ప్రస్తుతం గంటాపై శీతకన్ను వేసినట్టుగా అర్థమవుతుంది. అదే సమయంలో పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు అండగా ఉండకుండా వైసీపీకి వెళ్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మరో సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ లు విశాఖ వచ్చినా వారిని కలిసేందుకు కూడా గంటా ఇష్టపడలేదని, పార్టీ మారాలని గంటా బలంగా అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక టీడీపీలోనే ఉండిపోయారన్నది సొంత పార్టీలోని గంటా ప్రత్యర్థుల మాట. దీంతో అలాంటి నేతకు మంత్రి పదవి ఇస్తే మేము అంగీకరించమంటూ ఇతర ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చినట్టుగా సమాచారం. దీంతో మంత్రివర్గం లో గంటా పేరు లేకుండా పోయింది.
విశాఖ ఈస్ట్, వెస్ట్ నుంచి నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు
అదే సమయంలో విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులది ఇద్దరిదీ వరుసగా నాలుగోసారి సాధించిన విజయాలు. వాళ్లలో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ప్రచారం జరిగింది. మరొక విశాఖ సౌత్ నియోజకవర్గ నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ గెలిస్తే నార్త్ నియోజకవర్గంలో నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి విజయం సాధించారు. దీంట్లో వీళ్ళిద్దరిలో కూడా ఒకరికి కేబినెట్లో బెర్త్ దొరుకుతుందన్న చర్చ కూడా జరిగింది. కానీ వాటికి భిన్నంగా తెలుగుదేశం అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది.
ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రులకు అదే అనుభవం
అదే సమయంలో ఉమ్మడి జిల్లాను తీసుకుంటే మాజీ మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు తోపాటు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణలో ఎవరో ఒకరికి ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నలుగురిని పక్కనపెట్టి కేవలం వంగలపూడి అనితకు మాత్రమే అవకాశం కల్పించడంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఒకవేళ సీనియర్లలో ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే అది అసంతప్తికి దారితీస్తుందని అలాంటప్పుడు సీనియార్టీలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించినట్టుగా సమాచారం.
అనితకు సహకారం అందేనా..?
ఉమ్మడి విశాఖ జిల్లాలో మహామహులను కాదని, పాయకరావుపేట నుంచి రెండోసారి ఎన్నికైన వంగలపూడి అనితకు పార్టీ ప్రాధ్యాన్యత ఇస్తూ కేబినెట్‌లో స్థానం కల్పించడంపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మంత్రి పదవి ఆశించిన సీనియర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ఒకింత అసంతృప్తితో రగిలిపోతున్నారట. అనితకు ఇవ్వడంపై మాకు కోపం లేదు కానీ, మా సీనియారిటీలను, సేవలను అసలు ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదని ఆవేదన వ్యక్తం అవుతుందట.
అలా అని తమ అసంతృప్తిని బయటపెట్టే పరిస్థితి లేదు సీనియర్ నేతలకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జనసేనతో సంబంధం లేకుండా ఇప్పుడు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు అలిగిన అసంతృప్తికి గురైనా పార్టీ అధిష్టానానికి విన్నవించుకోవాల్సిందే తప్ప తమ అసంతృప్తిని కూడా బహిరంగంగా బయటకు వ్యక్తం చేసే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో అనితకు మిగతా సీనియర్లు అందరూ సహకరిస్తారా లేదా అన్న చర్చ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




