విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ లైంగిక వేధింపులు! ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘటన
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో లెక్చరర్ తిరుపతిరావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట దెబ్బతినడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ట్రిపుల్ ఐటీల్లో సీటు వస్తే తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎంతో మంది తల్లిదండ్రులు కలలు కని, కష్టపడి చదివించాలనుకుంటారు. కానీ కొందరు ఉపాధ్యాయుల చేష్టలతో ట్రిపుల్ ఐటీ ప్రతిష్ట దెబ్బతింటోంది. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం, లైంగిక వేధింపుల వంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ వేధింపులకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో ఫిజిక్స్ లెక్చరర్ తిరుపతి రావు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సదరు లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఆ విద్యార్థిని ఇడుపులపాయ ఆర్కే ర్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిజిక్స్ లెక్చరర్ తిరుపతిరావు పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఫిజిక్స్ లెక్చలర్ తిరుపతిరావు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా మిగతా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు క్యాంపస్‌లో జరుగుతుంటే తమ పిల్లల్ని ఎలా అక్కడ చదివించాలంటూ ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.