AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కూతురు.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..

అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య సంచలనం సృష్టించింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానన్న కూతురిని తండ్రి కడతేర్చాడు.. వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటాననడంతో కన్నతండ్రి హత్య చేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది..

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కూతురు.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..
Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 6:09 PM

Share

అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య సంచలనం సృష్టించింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానన్న కూతురిని తండ్రి కడతేర్చాడు.. వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటాననడంతో కన్నతండ్రి హత్య చేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.. అనంతపురం జిల్లా గుంతకల్ తిలక్ నగర్ లో నివాసముంటున్న తుపాకుల రామాంజనేయులుకు నలుగురు కుమార్తెలు… చిన్న కుమార్తె అయిన భారతి (19) అదే గుంతకల్ కు చెందిన మరో యువకుడితో ప్రేమలో పడింది. కాకపోతే ఇద్దరి కులాలు వేరు… అయినా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టడంతో… గత కొద్ది రోజులుగా కూతురు భారతి… తండ్రి రామాంజనేయులు మధ్య గొడవ జరుగుతుంది.

ప్రేమ వ్యవహారం బయటపడటంతో సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కుమార్తెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచాడు రామాంజనేయులు.. చిన్న కూతురు భారతి కంటే పెద్ద కూతుళ్లకు ఇంకా పెళ్లి కాకపోవడంతో… కులాంతర వివాహానికి ఒప్పుకుంటే మిగిలిన కుమార్తెలకు ఇబ్బంది కలుగుతుందని గత కొద్ది రోజులుగా తండ్రి కూతుళ్ళ మధ్య వాగ్వాదం నడుస్తోంది. అయినా ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చిన్న కుమార్తె భారతి స్పష్టంచేసింది.. దీంతో ఈ నెల ఒకటవ తేదీన గుంతకల్ పట్టణానికి దూరంగా ఉన్న తిక్క స్వామి దర్గా దగ్గరలోని కొండగుట్టలోకి తండ్రి రామాంజనేయులు కుమార్తె భారతిని తీసుకెళ్లాడు.

పెద్దల మాట కాదని ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని అనడంతో.. తండ్రి రామాంజనేయులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూతురు అన్న కనికరం కూడా లేకుండా… ఆగ్రహంతో తండ్రి రామాంజనేయులు కూతురు భారతిని…. ఆమె చున్నీతో భారతి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని తన బైక్ లో ఉన్న పెట్రోల్ తీసి తగలబెట్టాడు. సగం కాలిన శవాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చిన రామాంజనేయులును.. కుమార్తె భారతి ఎక్కడ అంటూ భార్య నిలదీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కూతురిని హత్య చేసిన రామాంజనేయులు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మొదట శవాన్ని హంద్రీనీవా కాలువలో వేశానని చెప్పగా… రెండు మూడు రోజులుగా కాలువ అంత గాలించిన డెడ్ బాడీ దొరకపోవడంతో… పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని చెప్పాడు.. అనంతరం గుట్టల్లో ఉన్న సగం కాలిన భారతి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.

అనంతరం సంఘటన స్థలంలోనే భారతీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం తండ్రి రామాంజనేయులు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేవలం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటాననడంతోనే… తండ్రి రామాంజనేయులు పరువు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..