Heavy Rains: నైరుతి రుతుపవనాల రాకతో ఏపీలో కురుస్తున్న ఉరుములు, పిడుగులతో కూడాన పిడుగుల భారీ వర్షాలు
Heavy Rains: నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో..
ఆగ్నేయ అరేబియా సముద్రంలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల రాకతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇప్పటికే రాష్టంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు దంచికొట్టాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. మరోవైపు పిడుగులతో భారీ సంఖ్యలో మూగజీవాలు మృతి చెందాయి. ఈ తీవ్ర విషాద ఘటన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..
అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది.ఈ పిడుగుపాటుకు 13 ఆవులు 6 మేకలు మృత్యువాత పడ్డాయి.పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి.భీమన్న అనే గిరిజనుడు తోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.దీనితో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకుని వెళ్ళారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.
బుధవారం కృష్ణా జిల్లా నూజివీడులో 122 మిల్లీమీటర్లు, అగిరిపల్లిలో 109, తోటపల్లిలో 99, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, పలాసలో 50, కంచిలిలో 48, మెళియాపుట్టి, రాజాంలలో 47, ఇచ్ఛాపురంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, నెల్లిమర్లలో 44.25 మిల్లీమీటర్లు, సీతానగరంలో 41.5, విశాఖ జిల్లా కె.కోటపాడులో 34.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.