Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. వరదలో చిక్కుకున్న వందలాది గొర్రెలు.. చివరకు..
Telangana Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువులను
Telangana Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో జనంతోపాటు మూగజీవాలు ఇబ్బందిపడుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో పశ్చిమగోదావరి పరిధిలోని వేలేరుపాడు మండలాన్ని పెద్దవాగు నుంచి వచ్చిన వరద ముంచెత్తింది.
ఎటువంటి హెచ్చరికలు లేకుండా పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నీట మునిగింది. ఒక్కసారిగా వరద నీరు రావడంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో వందలాది గొర్రెలు, కాపర్లు నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు, రెస్క్యూ బృందం ఆ గొర్రెలను సురక్షితంగా కాపాడారు. వరదలో వందలాది గొర్రెలు ఒక్కసారిగా చిక్కుకోవడంతో అతికష్టం మీద వాటిని రక్షించినట్లు స్థానికులు తెలిపారు.
కాగా.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ద్రోణిగా మారడంతో.. రాష్ట్రమంతటా హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం సూచనలు చేసింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లను విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: