Srisailam Dam Water: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైలం..
Srisailam Dam: అక్కడికి వెళ్తుంటే అదో అనుభూతి. డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తే, ఇక ఆ దృశ్యాల గురించి వర్ణించలేం. అక్కడి నుంచి నీరు విడుదల చేస్తున్నారని తెలిస్తే, జనాలు తండోపతండాలుగా వచ్చి..
అక్కడికి వెళ్తుంటే అదో అనుభూతి. డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తే, ఇక ఆ దృశ్యాల గురించి వర్ణించలేం. అక్కడి నుంచి నీరు విడుదల చేస్తున్నారని తెలిస్తే, జనాలు తండోపతండాలుగా వచ్చి ఆ సుందరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. చూడటానికే కనులార విందుగా ఉంటుంది. 885 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు దుంకుతుంటే.. ఆ దృశ్యమే ఓ అద్భతం. నీళ్లలో నుంచి వచ్చే నురగ పాలకన్నా తెల్లగా ఉంటాయి. ఇది చదువుతుంటే.. వెళ్లి చూడాలనిపిస్తోంది కదా.. ఆ ఘట్టానికి ఇంక కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం గేట్లు ఎత్తబోతున్నారు.
ఇటు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున శ్రీశైలం డ్యామ్‌కు వరద వస్తుంది. అటు జూరాల నుంచి శ్రీశైల మల్లన్న చెంతకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఈ రెండ్ డ్యామ్‌ల నుంచి సుమారు 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇప్పటికే జూరాల, తుంగభద్ర నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నారు.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876 అడుగులకు పైగా నీరు చేరింది. 215 టీఎంసీలకు గాను 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రవాహం స్థిరంగా ఉండడంతో కొన్ని గంటల్లోనే డ్యామ్ పూర్తిగా నిండబోతోంది.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో అధికారులు చర్చించారు. మంత్రి రాని పక్షంలో శ్రీశైలం ఎమ్మెల్యేతో పూజలు చేయించి గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కోరినట్లుగా రైట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. డ్యాం నిండే అవకాశం ఉండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు.