AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పాదయాత్రలు, ర్యాలీలు మంచిది కాదు.. ఏపీ ప్రభుత్వం, రైతులకు హైకోర్టు హితవు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతోంది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులు కోరుతుంటే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణ తమ..

Andhra Pradesh: పాదయాత్రలు, ర్యాలీలు మంచిది కాదు.. ఏపీ ప్రభుత్వం, రైతులకు హైకోర్టు హితవు..
Ap High Court
Amarnadh Daneti
|

Updated on: Nov 02, 2022 | 3:47 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతోంది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులు కోరుతుంటే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణ తమ విధానమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీంతో అమరావతికి మద్దతుగా ఆ ప్రాంత రైతులు వివిధ కార్యక్రమాలు చేస్తుంటే.. మూడు రాజధానులకు మద్దతుగా కూడా ఏపీలో ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. అమరావతి రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అసరవెల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది. అయితే షరతులను సవరించాలని అమరావతి రైతులు కోరగా న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు పాదయాత్రను అనుమతించవద్దని ప్రభుత్వం కోరగా.. ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అయితే తాజాగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ తాము పాల్గొనే అవకాశం ఇవ్వాలని రైతాంగ సమాఖ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రైతాంగ సమాఖ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

రైతాంగ సమాఖ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై నవంబర్ రెండో తేదీ బుధవారం హైకోర్టు డివిజినల్ బెంచ్‌లో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లు బెంచ్ మీదకు రాకపోవడంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. రైతుల పిటీషన్‌ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. పాదయాత్రకు సంఘీభావం తెలపడం.. తమ నిరసనను తెలియచేసే ప్రాధమిక హక్కును ఉపయోగించడమేనని రైతుల తరపున వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తరువాత, పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని అమరావతిపై తీర్పు ఇచ్చిన తరువాత …. ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్ర చేయడం మంచిది కాదని ధర్మాసనం ఈ సందర్భంగా ఇరు పక్షాలకు హితవు పలికింది.

అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, రాజధానికి సంబంధించి కూడా తీర్పులో స్పష్టంగా చెప్పామని, అటువంటప్పుడు ఇంకా పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది. పాదయాత్ర అంశంపై సింగిల్ జడ్జ్‌ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే సింగిల్ జడ్జ్‌లు ఇరువురు తమ ఉత్తర్వులు వెల్లడించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బాధిత పక్షం కోర్టుకు రావాలి కానీ, వేరే వాళ్లు రావడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అయితే బాధితులకు సంఘీభావం తెలిపేందుకే తాము పిటీషన్‌ వేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. కాగా దీనిపై ప్రభుత్వం వేసిన కౌంటర్‌ను పరిశీలించాలని న్యాయస్థానం భావిస్తూ.. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..