AP Crop Damage: ఆంధ్రప్రదేశ్‌లోని పంటపొలాల్లో అల్లకల్లోలం సృష్టించిన గులాబ్ తుఫాన్
విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. భారీగా ఆస్తి, పంట నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా కలిగించింది.
Andhra Pradesh Crop Loss: విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. భారీగా ఆస్తి, పంట నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా కలిగించింది. గులాబ్ బీభత్సానికి నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. అలాగే, రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. గులాబ్ తుఫాన్ రైతులకైతే తీరని నష్టం మిగిల్చింది. 60వేల ఎకరాల్లో వరి నీట మునిగగా, మరో 60వేల ఎకరాల్లో జొన్న, పత్తి, చెరుకు, బొప్పాయి లాంటి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి.
విశాఖ జిల్లాను కూడా గులాబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగింది. అరకు, పాడేరులో వరద ఉధృతికి వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. 30మండలాలు, 244 గ్రామాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా ముగ్గురు మృతిచెందగా, పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. 135 ఇళ్లు దెబ్బతిన్నాయి. 355 కిలోమీటర్ల మేర రహదారి ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
గులాబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 15వందల ఎకరాల్లో వరి, 830 ఎకరాల్లో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయన్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నష్టంపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రాథమిక నివేదిక అందించినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని అన్నారు.
గులాబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నీట మునిగిన పంటలను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. ఆముదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలోని పలు గ్రామాల్లో తమ్మినేని పర్యటించారు. పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు.