మంగళగిరి కొండపై గండభేరుండ జ్వాలా దీపం.. కార్తీక పౌర్ణమి రోజు చూసి తరించిన భక్తజనం
కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళగిరి కొండపై ఉన్న మంగళాద్రిపై గండాలయ్య స్వామి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించి గండభేరుండ జ్వాలా దీపాన్ని వెగించారు. ప్రతి ఏడాది ఇలా దీపాన్ని వెలిగించడం ద్వారా గండాలయ్య స్వామి ఎటువంటి గండాలు రాకుండా కాపాడుతుంటాడని మంగళగిరి వాసులు నమ్ముతుంటారు. ఈ దీపాన్ని తిలకించేందుకు ప్రతి ఏటా వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అలాగే ఈ సారి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ దీపాన్ని చూసి తరించారు.

మంగళగిరిలోని మంగళాద్రిపై గండాలయ్య స్వామి కొలువై ఉన్నాడు. ఈ కొండపై నిత్యం దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి వారికి మొక్కుకున్న భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారి రూపంలో కొలువై ఉన్న దీపానికి నూనె వడ్డిస్తుంటారు. గండాలయ్య స్వామి ఎటువంటి గండాలు రాకుండా కాపాడుతుంటాడని మంగళగిరి వాసులు నమ్ముతుంటారు. అటువంటి స్వామి చెంతన కార్తీక పౌర్ణమి రోజు గండభేరుండ జ్వాలా దీపాన్ని వెలిగిస్తున్నారు. గత కొంతకాలంగా సనాతన రక్షా సేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
గండభేరుండ జ్వాలా దీపాన్ని వెలిగించడానికి 225 కిలోల ఇత్తడి ప్రమిదను తయారు చేయించారు. ఈ ప్రమిదలో 250 కిలోల ఆవు నెయ్యిని పోస్తారు. ఈ దీపం వెలిగించేందుకు ప్రత్యేక వస్త్రంతో ఒత్తిని తయారు చేస్తారు. 700 మీటర్ల వస్త్రాన్ని ఆరు నెలల పాటు శ్రమించి రూపొందిస్తారు. ముగ్గురు చేనేత కార్మికులు రోజుకు మూడు గంటల పాటు ఈ వస్త్రాన్ని నేస్తారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని గండభేరుండ జ్వాల దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఈ దీపాన్ని వెలిగిస్తారు.
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ కింద కొలువై ఉండగా కొండ మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక కొండ ఎగవ భాగంలో ఉన్న గండాలయ్య స్వామి వద్ద ఈ కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం మంగళగిరి పరిసర ప్రాంతాలతో పాటు రాజధానిలోని అనేక గ్రామాల్లో నుండి కూడా ఈ దీపాన్ని తిలకించవచ్చు. ఈ ఏడాది అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసి దీపాన్ని వెలిగించారు. ఈ గండబేరుండ దీపాన్ని కన్నులా చూసి భక్తులు తరించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
