AP News: భర్త కనిపించట్లేదంటూ డయల్ 100కి మహిళ ఫిర్యాదు.. తీరా ఎంక్వైరీ చేయగా.!
Vizag News Update: గాజువాక షీలానగర్‌లో కిడ్నాప్ కలకలం పోలీసులను పరుగులు పెట్టించింది. ఎంకె కాంక్రీట్ మార్కెటింగ్ హెడ్ రమేష్‌ను ఎత్తుకెళ్లారు సంస్థ ఉద్యోగులు. బాధితుడి భార్య డయల్-100కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నిందితులు బాధితుడిని తిరిగి షీలా నగర్‌లో దించేసి పరారయ్యారు నిందితులు.

విశాఖపట్నం, అక్టోబర్ 23: గాజువాక షీలానగర్‌లో కిడ్నాప్ కలకలం పోలీసులను పరుగులు పెట్టించింది. ఎంకె కాంక్రీట్ మార్కెటింగ్ హెడ్ రమేష్‌ను ఎత్తుకెళ్లారు సంస్థ ఉద్యోగులు. బాధితుడి భార్య డయల్-100కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నిందితులు బాధితుడిని తిరిగి షీలా నగర్‌లో దించేసి పరారయ్యారు నిందితులు. మూడు గంటల పాటు బంధించి దాడి చేసినట్టు బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. దెబ్బలతో శరీరమంతా గాయాలు కమలిపోయినట్టు కనిపిస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంకె కాంక్రీట్ అనే సంస్థలో మార్కెటింగ్ హెడ్‌గా రమేష్ పని చేస్తున్నాడు. ఏడాదిన్నరగా అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం రమేష్ షీలానగర్‌లో తన నివాసం వద్ద నడుచుకుంటూ వెళుతుండగా.. కొందరు కారులో బలవంతంగా అతన్ని ఎత్తుకెళ్లారు. మారికవలస లోనే గెస్ట్ హౌస్‌కు తీసుకువెళ్లి బంధించి దాడి చేశారు. అతడి ఫోన్ కూడా తీసుకున్నారు. భర్త ఆచూకీ లేకపోవడంతో బాధితుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ లొకేషన్ మారికవలస వైపు వస్తుండటంతో పోలీసులు ఆ వైపు వెళ్లారు. ఇంతలో తీవ్రంగా చితకబాదిన నిందితులు.. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో షీలానగర్ ప్రాంతంలో బాధితుడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంస్థ ఎండీ మౌనిక, శశికాంత్, వంశీకృష్ణ, రాములను అదుపులోకి తీసుకున్నారు.
జీతం అడిగినందుకు కక్ష పెట్టుకున్నారు.. చనిపోతానని అనుమానంతో..
తనను మూడు గంటలు బంధించి చిత్రహింసల గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు రమేష్. తన సెల్‌ఫోన్ లాక్కుని తనపై దాడి చేసింది వీడియోగా చిత్రీకరించారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను చనిపోతానేమోనని భయపడి తిరిగి తీసుకొచ్చి వదిలేసారని అంటున్నాడు. కేవలం బాకీ ఉన్న జీతం కోసం ప్రశ్నించడంతోనే తనపై కక్ష పెట్టుకున్నారని తెలిపాడు. సంస్థ యజమాని కిడ్నాప్ చేయించినట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ గల కారణంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. కారణం ఏదైనా.. ఒక వ్యక్తిని ఎత్తుకెళ్లి బంధించి దాడి చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎట్టకేలకు కిడ్నాప్ కథ సుఖంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.




