Dwaraka Tirumala: చిన వెంకన్నకు ఏడాదిలో రెండు బ్రహ్మోత్సవాలు.. ఎందుకు చేస్తారో తెలుసా

ఒకసారి వైశాఖమాసంలోనూ, మరొకసారి అశ్వయుజ మాసంలోనూ స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లికొడుకు, పెళ్ళికూతుర్లుగా అలంకరిస్తారు.

Dwaraka Tirumala: చిన వెంకన్నకు ఏడాదిలో రెండు బ్రహ్మోత్సవాలు.. ఎందుకు చేస్తారో తెలుసా
Dwaraka Tirumala
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Oct 23, 2023 | 3:22 PM

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాదికి రెండుసార్లు స్వామివారికి ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా అధికమాసం వచ్చిన ఆ సంవత్సరం మూడుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి గల కారణం ఏమిటి.. బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు, ఆలయ విశిష్టత, ఆలయంలో పూజా విధానాలు ఏ ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం ఒకటి.  దీనిని భక్తులు చిన్న తిరుపతిగా పిలుస్తుంటారు. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించి తమ మొక్కుబడులు సమర్పిస్తారు. అయితే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కును సైతం చిన తిరుపతిలో తీర్చుకున్న ఆ మొక్కు స్వామికి చేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ఏడాదికి రెండు పర్యాయాలు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ చిన వెంకన్న స్వామి ఆలయ గర్భాలయంలో ఇద్దరు ధ్రువమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు.

ఎందుకంటే ద్వారకా మహర్షి స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు ఆచరించారు. ద్వారక మహర్షి చాలా కాలం తపస్సులో ఉండిపోవడంతో ఆయన చుట్టూ వల్మీకం (పుట్ట) ఆవరించింది. అయితే స్వామివారు ద్వారక మహర్షి తపస్సుకు ప్రసన్నమై అక్కడ స్వయంభువుగా వెలిశారు. అయితే స్వామివారి మూర్తి నడుము నుండి సగభాగం వల్మీకంలో కప్పబడిపోయింది. అయితే విష్ణు సేవలో పాదపూజే ప్రాధాన్యం కావడం, ఇక్కడ స్వామివారి పాదాలు ఆ వల్మీకంలో ఉండిపోవడంతో పాద పూజకు వీలు లేకుండా పోవడంతో అర్చకులు, వేద పండితులు పెద్ద తిరుపతి నుంచి మరొక మూర్తిని తీసుకువచ్చి స్వయంభూ మూర్తి వెనుక భాగాన ప్రతిష్టించారు. దీంతో ఇక్కడ స్వామి వారు ఇద్దరు దృవమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ కారణం చేతనే ఇక్కడ ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఒకసారి వైశాఖమాసంలోనూ, మరొకసారి అశ్వయుజ మాసంలోనూ స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లికొడుకు, పెళ్ళికూతుర్లుగా అలంకరిస్తారు. రెండవ రోజు ద్వజారోహణ, మూడవరోజు సూర్య ప్రభ, చంద్ర ప్రభా వాహనాలపై స్వామి వారి గ్రామోత్సవం, నాలుగవ రోజు ఎదుర్కోల ఉత్సవం, ఐదవ రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, ఆరవ రోజు ద్వారకాతిరుమల పురవీధులలో స్వామివారి రథోత్సవం, ఏడవ రోజు చక్రస్నానం, ధ్వజ అవరోహణ, ఎనిమిదవ రోజు వసంతోత్సవం, చూర్ణోత్సవం ఆ రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు పవళింపు సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తారు.

అదేవిధంగా ఇక్కడ స్వామివారి పూజలన్నీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించడం ఈ ఆలయ విశిష్టత. అయితే ఒక్కోసారి సంవత్సరంలో అధికమాసం వస్తుంది. ఆ సమయంలో మరోసారి అంటే ఆ ఏడాది మూడుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..