- Telugu News Photo Gallery Navaratri, Brahmotsavalu, Saddula Bathukamma Celebrations High Up In Telugu States
ఘనంగా బతుకమ్మ సంబరాలు.. చివరి దశకు చేరుకున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకే బతుకమ్మ అన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Updated on: Oct 23, 2023 | 12:54 PM

కలియుగ వైకుంఠం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం చేయించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి తిరుమంజనం నిర్వహించి అభిషేకం చేశారు. పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు పవిత్రస్నానం ముగిసిన అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రేపు శ్రీవారి పార్వేట ఉత్సవం జరగనుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు మహిషాసుర మర్థిని, రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో కంపార్ట్‌మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే దశమి గడియ తర్వాత రాజరాజేశ్వరీ దేవి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు కడతేరుతాయని నమ్ముతారు భక్తులు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకే బతుకమ్మ అన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. నిర్మల్‌లో ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై చిన్నారులతో కలిసి సందడిచేశారు. మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడారు. చిన్నారులు, మహిళలతో కోలాటమాడుతూ మరింత ఉత్సాహం నింపారు మంత్రి.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలో కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రసాద రెడ్డి పాల్గొన్నారు. పెరికసింగారంలో 43 అడుగుల భారీ సద్దుల బతుకమ్మను ఏర్పాటు చేయగా...ఆ వేడుకలో పాల్గొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు. గ్రామస్థులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. గువ్వల గూడెం లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి రెడ్డి, సోదరుడు ప్రసాద రెడ్డి పాల్గొని గ్రామస్తులతో కలిసి కోలాటం ఆడారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. నేలకొండపల్లి మండలంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే సతీమణి విజయలక్ష్మి, కూతురు దీప్తి పాల్గొని గ్రామస్తులతో కలిసి కోలాటం ఆడారు. తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ పండుగ గ్రామస్తులంతా కలిసి ఘనంగా జరుపుకోవడం సంతోషకరం అన్నారు కందాల కుటుంబ సభ్యులు.





























