Kollu Ravindra: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత.. ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో కేసు నమోదు
Kollu Ravindra: మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో రవీంద్రపై కేసు నమోదైంది....
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో రవీంద్రపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. రవీంద్ర అరెస్టు కారణంగా మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
అయితే ఎన్నికల సందర్భంగా బుధవారం కొల్లు రవీంద్ర, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, మచిలీపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలో పోలింగ్ కేంద్రానికి టీడీపీ కొల్లు రవీంద్ర, మరి కొందరు కార్యకర్తలతో కలిసి వచ్చారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్ అమలులో ఉందని, లోపలికి వెళ్లేందుకు కుదరదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏయ్ ఎస్సై నన్ను ఆపుతావా. అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కొంతసేపు పోలీసులు- కొల్లు రవీంద్ర మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్సైపై చేయి చేసుకున్నాడని కొల్లు రవీంద్రపై 506,341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కొల్లు రవీంద్ర అరెస్టును ఖండించిన చంద్రబాబు
కాగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేకి.. బీసీలను పండగ రోజు సంతోషంగా ఉండనివ్వడం లేదంటూ మండిపడ్డారు. వెంటనే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.