Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balineni Srinivasa Reddy: అనుకున్నదే జరిగింది.. వైసీపీకి బాలినేని రాజీనామా

వైఎస్సార్సీపీకి దెబ్బ మీది దెబ్బ తగులుతుంది. ఇప్పటికీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖ పంపారు.

Balineni Srinivasa Reddy: అనుకున్నదే జరిగింది.. వైసీపీకి బాలినేని రాజీనామా
Balineni Srinivasa Reddy
Ram Naramaneni
|

Updated on: Sep 18, 2024 | 5:11 PM

Share

అనుకున్నదే జరిగింది.  వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు.  కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు.

కొన్నాళ్లుగా వైసీపీ హైకమాండ్‌పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు.. అలక బూనారు. వైవీ సుబ్బారెడ్డితో ఎప్పటి నుంచో బాలినేనికి విభేదాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ విషయంలోనూ బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనూ బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలినేనిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి జెంకె వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ చర్యలతో పార్టీలో బాలినేనికి పట్టు లేకుండా పోయింది.

ఆ తర్వాత ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ బాలినేని కొంత అసంతృప్తి వ్యక్తంచేశారు. మాగుంటకు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. కానీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. చివరకు తన టికెట్ విషయంలోనూ పార్టీలో చర్చ జరిగింది. ఒంగోలు కాకుండా గిద్దలూరు లేదంటే దర్శిలో పోటీ చేయాలని అప్పట్లో పార్టీ ప్రతిపాదించినట్టు ప్రచారం. ఈ విషయాలు బాలినేనిలో అసంతృప్తికి కారణమైంది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అది మరింత ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో బాలినేనితో పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది. ఇటీవలే అధినేత వైయస్ జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవనీ, అందుకే తనదారి తాను చూసుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు జగన్‌కే చెప్పేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒంగోలుకు చెందిన 20 మంది కార్పోరేటర్లు, మరికొందరు సన్నిహితులతో బాలినేని భేటీ అయ్యారు. తాజాగా పార్టీని వీడుతూ బాలినేని నిర్ణయం తీసుకున్నారు.

బాలినేని రాజీనామా లేఖ సారాంశం దిగువన చూడండి… 

గౌరవనీయులైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి,

కొన్ని కారణాల రీత్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.

రాష్ట్రం ప్రగతి పధం లో వెళ్తే ఖచ్చితం గా రాజకీయాలకు అతీతం గా అభినందిస్తాను. కారణం అంతిమంగా ప్రజాశ్రేయాస్సే రాజకీయాలకు కొలమానం కదా. విలువలను నమ్ముకొనే దాదాపు 5 సార్లు ప్రజా ప్రతినిధిగా 2 సార్లు మంత్రి గా పని చేసాను అన్న తృప్తి కొంత గర్వం కూడా ఉంది.

రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. YSR కుటుంబానికి సన్నిహితుడునే అయినా , జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకొన్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేసాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకొన్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన భాద్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను.

అందరికీ ధన్యవాదాలు

ఇట్లు

మీ బాలినేని శ్రీనివాస రెడ్డి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.