AP News: ఏపీ ప్రభుత్వానికి మరో రిలీఫ్.. ఆర్థిక లోటు భర్తీ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం..
Revenue deficit grant: ఏపీతో పాటు మొత్తం 14 రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ మొత్తం 7,183 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.
Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (GST) బకాయిలను మోడీ సర్కార్.. ఇటీవల రాష్ట్రాలకు విడుదల చేసింది. కిందటి నెల బకాయిలను సైతం రాష్ట్రాలకు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని మొత్తం 86,912 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్టీ బకాయిల చెల్లింపుల్లో ఏపీ వాటా 3,199 కోట్ల రూపాయలు. తెలంగాణ వాటా కింద రూ. 296 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ క్రమంలో ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో ఫైనాన్స్ రిలీఫ్‌ను సైతం ప్రకటించింది. రెవెన్యూ లోటు (revenue deficit grant) భర్తీ మొత్తాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని విలువ రూ.880 కోట్లుగా ఉంది. ఏపీతో పాటు మొత్తం 14 రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ మొత్తం 7,183 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.
రెవెన్యూ లోటు భర్తీని ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో ఏపీ సహా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాలకు పోస్ట్ రివేల్యుయేషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను విడుదల చేయాలంటూ 15వ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మొత్తం పోస్ట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ (పీడీఆర్డీ) కిందికి వస్తుందని ఆర్థికశాఖ ప్రకటించింది. ఈ నెలకు సంబంధించిన మొత్తంగా దీన్ని భావించాల్సి ఉంటుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు రూ.21,550.25 కోట్లుగా తేల్చింది. ప్రస్తుతం ఏపీ ఇప్పుడు ఎదుర్కొంటోన్న ఆర్థికలోటు నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా రూ.880 కోట్లు విడుదల కావడం కాస్త ఊరటనిచ్చింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..