Andhra: 2,400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం.. ఆదరణకు నోచుకోని అశోకుడి కూతురు కట్టించిన అద్భుత కట్టడం.. ఎక్కడుందంటే
అశోకుడు చెట్లు నాటించారని పాఠాలు చెప్తారు. కానీ అశోకుడి కూతురు కట్టించిన చారిత్రక కట్టడాన్ని ఎవరూ కన్నెత్తి చూడ్డంలేదు.. అదెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.. అసలు ఆ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది..? ఎలా వుంది? అనే వివరాలను తెలుసుకుందాం..

బుద్దం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి అని విలపిస్తోంది ఈ చారిత్రక అద్భుతం. బీటలు వారుతోన్న ఘనచరితను కాపాడమని వేడుకుంటోంది ఆది బౌద్ద స్థూపం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు పరిధిలోని ఆదుర్రు బౌద్ధ స్థూపానికి 2వేల 4వందల ఏళ్ల ఘన చరిత్ర వుంది. అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర నిర్మించిన ఈ స్థూపాన్ని బౌద్దులు మహాక్షేత్రంగా భావిస్తారు. ఇది 17అడుగుల వ్యాసం కలిగిన వేదికతో ఓ పెద్ద చక్రంలా ఉంటుంది.చుట్టూ వున్న ఆయక వేదికలు కార్డినల్ దిశలను సూచిస్తాయి. అలనాటి నిర్మాణ శైలి అబ్బుర పరుస్తుంది. ప్రపంచంలోని 84 వేల స్థూపాల్లో మూడింటిని దివ్య స్థూపాలుగా పరిగణిస్తారు.
వాటిలో మొదటిదిగా ఆదుర్రు బౌద్ధ స్థూపం కావడం విశేషం.1955లో భారత పురావస్తు శాఖ ఈ స్థూపానని రక్షిత స్మారక చిహ్నాంగా ప్రకటించింది.తవ్వకాల్లో ఉప స్తూపాలు, బౌద్ద చైత్యాలు, మరెన్నో ఆనవాళ్లు లభించాయి ఇక్కడ. ఇంతటి ప్రాశస్త్యం వున్న ఈ బౌద్ధ కట్టడం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడంపై స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుర్రు బౌద్ద క్షేత్రాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ది చేయాలని కోరుతున్నారు. గోదావరి తీరానికి, మడ అడువులకు దగ్గరగా వున్న ఆదుర్రు బౌద్దక్షేత్రాన్ని అభివృద్ది చేస్తే చారిత్రక సంపదను కాపాడుకోవడంతో పాటు పర్యాటక కేంద్రంగా రాబడి పెరగడం ఖాయమంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




