Andhra News: ఏం స్కెచ్ వేశావ్ భయ్యా.. మనీహీస్ట్ లెవల్ గోల్డ్ స్కామ్.. కట్‌చేస్తే.. ప్లాన్ అట్టర్ ప్లాప్..
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగుచూసింది. బ్యాంక్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా లాకర్‌లో ఉన్న 6.449 కిలోల అసలు బంగారాన్ని వాటి ప్లేస్‌లో నకిలీ ఆభరణాలు ఉంచి భారీ మోసానికి తెరలేపాడు. అయితే పోలీసుల దర్యాప్తు అలసు విషయాలు వెలుగులోకి రావడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని నుండి రూ. 5.81 కోట్ల విలువైన 4.120 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారం కోసం విచారణ కొనసాగిస్తున్నారు.

నమ్మకంగా ఉంటూ బ్యాంకునే నిలువునా ముంచేసిన ఒక భారీ గోల్డ్ లోన్ మోసం ఉదంతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కలకలం రేపింది. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతాదారులు దాచుకున్న సుమారు 6.449 కిలోల బంగారు ఆభరణాలు మాయమవడం బ్యాంకింగ్ వర్గాలతో పాటు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 10 కోట్ల వరకు ఉండే ఈ భారీ కుంభకోణం గుట్టును తాజాగా ఏలూరు జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి బ్యాంక్‌లోనే గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు చలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
జంగారెడ్డి గూడెం వెలమపేటకు చెందిన భాస్కరరావు కుమారుడైన చలపాక రాజు (40) స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు తెచ్చే బంగారం నాణ్యతను పరిశీలించి లోన్ విలువను నిర్ధారించడమే ఇతని విధి. అయితే, ఇదే అతనికి వరంగా మారింది. లోపల జరుగుతున్న వ్యవహారాలపై బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అనుమానంతో ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో Cr.No.198/2026 కింద కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(5), 336(3), 305(5) ల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. బ్యాంకులో అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
నిందితుడు చలపాక రాజు తన హోదాను అడ్డం పెట్టుకుని, ఖాతాదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన అసలు బంగారు ఆభరణాలను లక్కీగా లోపలి నుండి అపహరించినట్టు గుర్తించారు. ఆ స్థానంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ ఆభరణాలను, ఇతర లోహపు వస్తువులను పెట్టి గిల్టు సరుకుతో లాకర్లను నింపేశాడు. ఇలా మాయం చేసిన 6.449 కిలోల అసలు బంగారాన్ని జంగారెడ్డిగూడెంలోని పలు జ్యువెలరీ దుకాణాల్లో తన పేరుతోనూ, అలాగే తన తల్లిదండ్రుల పేర్లతోనూ విక్రయించడం లేదా తాకట్టు పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నాడు.
ఈ భారీ ఆర్థిక నేరంపై ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ నేరుగా పర్యవేక్షణ చేపట్టగా, జంగారెడ్డిగూడెం ASP సుస్మిత అధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుడి గుట్టు రట్టు చేసిన పోలీసులు, అతని వద్ద నుండి రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని పలు నగల దుకాణాలపై దాడులు నిర్వహించి నిందితుడు విక్రయించిన, తాకట్టు పెట్టిన బంగారంలో 4.120 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని రికవరీ చేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఈ మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 5,81,65,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ స్కామ్‌లో మాయమైన మిగిలిన బంగారాన్ని కూడా వీలైనంత త్వరగా వెలికితీసేందుకు నిందితుడు చలపాక రాజును పోలీసు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ భారీ కుంభకోణంలో కేవలం అప్రైజర్ మాత్రమే ఉన్నాడా లేదా బ్యాంకులోని ఇతర సిబ్బంది ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఇతరుల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తే ఎంతటి వారినైనా సరే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ హెచ్చరించారు. కాగా, అత్యంత క్లిష్టమైన ఈ గోల్డ్ లోన్ మోసం కేసును రికార్డు సమయంలో ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలిసు బృందాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




