Mandous Cyclone: కళ్లాల్లో నీళ్లు.. కళ్లల్లో కన్నీళ్లు.. అన్నదాతకు గుండె కోత మిగిల్చిన మాండౌస్..
మాండౌస్ తుపాను ధాటికి కురిసిన వర్షం ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించింది. ఏపీ తీరంపై తుపాను ప్రభావం భారీగానే ఉంది. చేతికొచ్చిన పంట దెబ్బతినడం.. వరి కుప్పలు తడిసి ముద్దవడంతో అన్నదాత...
మాండౌస్ తుపాను ధాటికి కురిసిన వర్షం ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించింది. ఏపీ తీరంపై తుపాను ప్రభావం భారీగానే ఉంది. చేతికొచ్చిన పంట దెబ్బతినడం.. వరి కుప్పలు తడిసి ముద్దవడంతో అన్నదాత ఆవేదనచెందుతున్నాడు. అటు రాకాసి అలలు తీరాన్ని కోసేస్తున్నాయి.అకాల వర్షం రైతన్నకు గుండెకోత మిగిల్చింది. పంట చేతికొచ్చిన సమయంలో మాండూస్ తుఫాను అపార నష్టాన్ని కలిగించింది. కోస్తా తీరం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తుపాన్ వల్ల గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం రైతుల్లో ఆందోళన నెలకొంది. పొలాలు నీట మునిగాయి. నీటిలో నాని, పంట నుంచి మొక్కలు వస్తున్నాయి. ధాన్యం పోయడానికి సంచులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌బీకే సంచులు తక్కువ ఇవ్వడంతో రోడ్లపైనే ధాన్యాన్ని పోశారు. కృష్ణా జిల్లా దివిసీమలో వేలాది ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి , చల్లపల్లి , ఘంటసాల మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో పంట నాశనం అయింది. వర్షపు నీరు కూడా బయటకు పోయే అవకాశం లేకపోవడంతో వరి గింజలు కుళ్ళిపోయి మొలకలు వస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. తోకపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పెద్దారవీడు, మార్కాపురం మండలాలలోని పొలాలలో నిరు నిలబడడంతో మిర్చి పంట దెబ్బతిన్నది. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి భారీగా ఉండి బీచ్ కొతకు గురైంది. ఉప్పాడ-కాకినాడ మధ్య కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి. రాకాసి అలల తాకిడికి ఉప్పాడ, సూరడ పేట, మాయా పట్నం, కొనపాపేట దగ్గర ఒడ్డు భారీగా కోతకు గురై మత్స్యకార గృహాలు సముద్రంలో కలిసిపోయాయి. గతంలో కోట్ల రూపాయలతో రక్షణగా వేసిన జియో ట్యూబ్ పూర్తిగా సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు.. ఈ నెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..