సముద్రం బీచ్‌లో డ్రోన్ పహారా.. శత్రువుల కోసం కాదండోయ్! అసలు సంగతి ఇదే..
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో మునిగిపోతున్న పర్యాటకులు భద్రత కోసం నరసాపురం డీఎస్పీ డా జి శ్రీవేద ప్రత్యేక చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు డ్రోన్ వ్యవస్థను దాతల సహాయంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో బీచ్ లో ఐఐటి హైదరాబాద్ సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు. డ్రోన్ త్వరలో అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు పోలీసులు తెలిపారు..

ఏలూరు, జనవరి 4: గత కొన్నేళ్లుగా బీచ్ లో స్నానం చేస్తూ అలలు ఉదృతికి చాలా మంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు డీఎస్పీ శ్రీవేద దాతలు సహాయంతో రూ. 6 లక్షలతో ఐఐటి హైదరాబాద్ వారితో ప్రత్యేకంగా డ్రోన్ ఏర్పాటు చేశారు. బీచ్‌లో మునిగిపోయే ప్రమాదాలను అరికట్టడానికి డ్రోన్ ఉపయోగించి తాడు ద్వారా లైఫ్‌గార్డ్ ను అందిస్తుంది. దీనితో ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడవచ్చు.
గత ఇరవై సంవత్సరాలలో పేరుపాలెం బీచ్ లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పర్యాటకులు మునిగిపోతున్న ఘటనలను నివారించేందుకు, స్థానిక పర్యాటకాన్ని రక్షించేందుకు డీఎస్పీ శ్రీ వేద కొత్త టెక్నాలజీ ను ఉపయోగించి ప్రాణ నష్టం నివారించేందుకు సాగర రక్షపేరుతో డ్రోన్ తో మునిగిపోతున్న వారికి సహాయం చేసేందుకు ప్రణాళిక ను సిద్ధం చేశారు. దీనిని త్వరలో ఉపయోగంలోకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం ఈ డ్రోన్ పనితనంపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ‘సీ సేఫ్ 1.0 (సాగర రక్ష)’ డ్రోన్‌ను పేరుపాలెం బీచ్ లో మొగల్తూరు పోలీసులు విజయవంతంగా పరీక్షించారు. అదే Sea Safe 1.0 (సాగర రక్ష) అనే రెస్క్యూ డ్రోన్. ఇది మొగల్తూరు పోలీసుల ఆధ్వర్యంలో, GIS సాంకేతికత, సముద్ర మరియు పోర్టు భద్రతలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నీర్ ఇంటరాక్టివ్ సొల్యూషన్స్, హైదరాబాద్ సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ డ్రోన్ ప్రమాదకర అలల్లో చిక్కుకున్న వారికి తక్షణ ప్రాణ రక్షకంగా పనిచేయడానికి రూపొందించబడింది.
ఇది ఎలా పనిచేస్తుంది అంటే?
ఈ డ్రోన్ ను బీచ్ వాచ్ టవర్ పై భాగంలో ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మొత్తం తీర ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. శిక్షణ పొందిన లైఫ్ గార్డు ఎత్తైన ఈ వాచ్ టవర్ నుంచి సముద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఎవరైనా వ్యక్తి లేదా పడవ ప్రమాదంలో ఉన్నట్లు గమనించిన వెంటనే.. లైఫ్ గార్డు డ్రోన్‌ను ప్రయోగిస్తాడు. గాలిలో వేగంగా ప్రయాణించే ఈ డ్రోన్, అలల వల్ల పడవలకు కలిగే ఆలస్యాన్ని తప్పిస్తుంది. కొన్ని సెకన్లలోనే ప్రమాదంలో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకొని, ఆటోమేటిక్‌గా గాలి నుండే లైఫ్ రింగ్ ను వదులుతుంది. దీంతో బాధితుడికి వెంటనే తేలియాడే మద్దతు లభించి, మానవ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకునే వరకు అతడిని సురక్షితంగా ఉంచుతుంది.
స్థానిక సమాజానికి ఊతం
ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడాన్ని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన మునిగిపోతున్న ఘటనల కారణంగా, భద్రతా కారణాల దృష్ట్యా బీచ్‌ను పూర్తిగా మూసివేయాల్సి వస్తుందేమో అనే భయం ప్రజల్లో ఏర్పడింది. అలా జరిగితే, బీచ్ పర్యాటకం పై ఆధారపడి జీవించే 400కు పైగా కుటుంబాలకు అది తీవ్రంగా నష్టం కలిగించేది. చిన్న ఆహార స్టాళ్లు, ఫోటోగ్రాఫర్లు, స్థానిక విక్రేతలు ఇలా అనేక మంది జీవనం ఈ బీచ్ పై ఆధారపడి ఉంది. బీచ్‌ను మూసేయడం కాకుండా భద్రతతో కొనసాగించాలనే పోలీసుల ప్రయత్నం ఫలించాలని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల సముద్ర సాంకేతికత
మొగల్తూరు తీరంలో ఉండే బలమైన గాలులు, ఉప్పు గాలి వాతావరణం వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నీర్ ఇంటరాక్టివ్ సొల్యూషన్స్ సంస్థ SeaSafe 1.0 డ్రోన్‌ను రూపొందించింది. వాచ్ టవర్ పై ఉన్న లైఫ్ గార్డు పర్యవేక్షణను, డ్రోన్ వేగాన్ని కలిపి ఉపయోగించడం ద్వారా మొగల్తూరు పోలీసులు సహాయం ఎప్పుడూ కొన్ని సెకన్ల దూరంలోనే ఉండేలా చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొగల్తూరు ను పర్యాటకులకు మరింత సురక్షిత గమ్య స్థానంగా మార్చడంలో, అలాగే తీరప్రాంతంలో నివసించే వందలాది కుటుంబాలకు భద్రమైన జీవన వాతావరణాన్ని కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




