ఇదేం బాధరా నాయన.. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాలా..?
వేసవి వస్తుందంటేనే మన్యం జిల్లాలో పలు గ్రామాల గిరిజనులు వణికిపోతున్నారు. ఇంకా నిండు వేసవి ప్రారంభం కాక ముందే జిల్లాలో గిరిజనులకు త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నీటి ఎద్దడితో పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఊట బావులను ఆశ్రయిస్తున్నారు గిరిజనులు. గుక్కెడు నీరు ఇప్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్న ఫలితం మాత్రం శూన్యం.

వేసవి వస్తుందంటేనే మన్యం జిల్లాలో పలు గ్రామాల గిరిజనులు వణికిపోతున్నారు. ఇంకా నిండు వేసవి ప్రారంభం కాక ముందే జిల్లాలో గిరిజనులకు త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నీటి ఎద్దడితో పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఊట బావులను ఆశ్రయిస్తున్నారు గిరిజనులు. గుక్కెడు నీరు ఇప్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్న ఫలితం మాత్రం లేదు.
సాధారణ రోజుల్లో కొంతవరకు నీటి సమస్య లేకపోయినా ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ నీటి సమస్య తాండవిస్తుంది. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని దశాబ్దాలుగా స్థానిక గిరిజనులు ప్రభుత్వాలను వేడుకుంటున్నా నేటికీ ఆ సమస్య పలు గ్రామాలకు తీరడం లేదు. కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్య, వైద్యం, రహదారి వంటి సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘ నాయకులు అనేక ఉద్యమాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు.
ముఖ్యంగా గిరిశిఖర గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. త్రాగునీరు లేక అల్లాడి పోతుంటారు గిరిజనులు. రోజువారీ కూలీ చేసుకొని జీవించే గిరిజనులు సైతం తమ పనులన్నీ పక్కనపెట్టి కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లి ఊట బావులు, చలమలు లేక గెడ్డ నీటిని బిందెలతో తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటిల్లిపాది వెళ్లి కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకున్నప్పటికి శుభ్రమైన నీరు దొరక్క అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.
పాచిపెంట మండలానికి చెందిన కుమ్మరివలస గ్రామంలో నివాసం ఉంటున్న గిరిజనులు నీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసిత గ్రామమైన ఇక్కడ గత సంవత్సరంలో బోరు రిపేర్ అయ్యింది. అయితే అధికారులు ఆ బోరు మరమ్మత్తు చేయకపోవడంతో అప్పటి నుండి నీటి కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు గ్రామస్తులు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చిన నీరు కూడా చాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదు.
అయితే గిరిజనులు ఊట బావులు, చలమల నీటిని ఆశ్రయించడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎండాకాలం కావడంతో అవి కూడా గణనీయంగా ఇంకిపోయి అడుగంటి అపరిశుభ్రంగా మారుతున్నాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అపరిశుభ్ర నీటినే వాడి రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా మరోవైపు చలమల వద్ద తిష్ట వేసుండే దోమలు కూడా విజృంభిస్తున్నాయి. నీటి కోసం గిరిజనులు చలమల వద్దకు వెళ్ళగానే అక్కడ ఉన్న దోమలు దండెత్తుతున్నాయి. అలా దోమల దోమకాటుకు గురై మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడుతున్నారు. ఏజెన్సీలో గుక్కెడు నీరు దొరక్క అనేక రకాల అవస్థలు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు మన్యం వాసులు. ఇప్పటికైనా ఏజెన్సీలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు గిరిజనులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..