Vizag: సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. మేఘం వర్ణంలో ఓ మెరుపు.. వెళ్లి చూడగా..
సముద్రంలో ఆటు పోట్లు కారణంగా రకరకాల జీవులు తీరానికి కొట్టుకువస్తూ ఉంటాయి. కొన్ని సార్లు అనారోగ్యంతో ఉన్న సొరచేపలు, తిమింగళాలు, టేకు చేపలు సైతం కనిపిస్తూ ఉంటాయి. అయితే విగ్రహాలు తీరానికి కొట్టుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? విశాఖలో అదే జరిగింది...

అది విశాఖ సమీపంలోని పెద్ద రుషికొండ బీచ్ ప్రాంతం. అదే ప్రాంతంలో నివశించే దీపాలి నాయుడు ఈవెనింగ్ వాక్ కోసం సాయంత్రం బీచ్‌వైపు వెళ్లారు. అయితే అనూహ్యంగా ఆమెకు ఓ విశిష్టమైన విగ్రహం కనిపించింది. దగ్గరికి వెళ్లి పరీక్షగా చూడగా.. అది ఎంతో శిల్ప సౌందర్యంతో కూడిన విష్ణుమూర్తి గ్రానైట్ విగ్రహంగా గుర్తించారు. అయితే ఆ విగ్రహం అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉంది. దాని ప్రత్యేకతను గుర్తించిన ఆమె వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు, మ్యూజియంల శాఖ నుంచి సిబ్బంది వచ్చి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది శతాబ్దాల నాటి విగ్రహం అని.. 3.1 అడుగుల ఎత్తు ఉందని.. సముద్రం లోపలి నుంచి కొట్టుకువచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విగ్రహం గురించి తెలిసిన వెంటనే.. చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి తరలివచ్చారు. ఈ విగ్రహం స్థానికంగా ఆసక్తిని, ఉత్సుకతను రేకెత్తించింది.
ఈ శిల్పం 13 లేదా 14వ శతాబ్దానికి చెందినది కావచ్చనని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. ఫాల్గుణరావు తెలిపారు. కానీ ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో ఆ విగ్రహం తయారు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ కాలంలో ఈ ప్రాంతం నుండి చాలా శిల్పాలు, విగ్రహాలు ఖొండలైట్ రాళ్లతో తయారు చేశారని.. అయితే ఇప్పుడు దొరికిన విగ్రహం గ్రానైట్‌తో తయారు చేయబడింది అని ఆయన చెప్పినట్లు ది హిందూ కథనాన్ని ప్రచురించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిఘంటువుల్లో శ్రీ మహావిష్ణువు 24 దైవిక రూపాల గురించి స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం దొరికిన విగ్రహం అందులో ఒకటైన జనార్దనాయ అవతారంలో ఉన్నట్లు చెబుతున్నారు. జనార్దనాయ రూపం భగవంతుడిని విశ్వ రక్షకుడు, పోషకుడిగా సూచిస్తుంది. ‘జనార్థన’ అనే పేరు సంస్కృతం నుండి పుట్టింది. ‘జన’ అంటే ప్రజలు… ‘అర్దన’ అంటే బాధలను తొలగించడం అని అర్థం.
దేవాలయాల్లోని దేవీదేవతల విగ్రహాలు దెబ్బతిన్నప్పుడు… వాటిని తొలగించి కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తారు. దెబ్బతిన్న విగ్రహాలను.. నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా బంగాళాఖాతంలో నిమజ్జనం చేయడానికి ముందు ఈ విగ్రహం ఒక ఆలయంలో పూజలు అందుకుని ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శిల్పాన్ని విశాఖ మ్యూజియంకు తరలించారు. అక్కడ దానిని ప్రజల ప్రదర్శన కోసం పురావస్తు విభాగంలో ఉంచనున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..