AP News: సాధారణ తనిఖీలు.. ఆగున్న హ్యుందాయ్ కారుపై అనుమానమొచ్చి చెక్ చేయగా.!
చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వర్తిస్తున్నారు. ఈలోగా ఓ తెల్లటి హ్యుందాయ్ కారు అటుగా వచ్చింది. ఆ కారును ఆపిన ఖాకీలు.. దాని ఓనర్‌ని ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడం.. మొత్తం కారు తనిఖీ చేశారు.. సీన్ కట్ చేస్తే.. దెబ్బకు షాక్ అయ్యారు.
కట్టలు కట్టలు.. లెక్కలేనన్ని డబ్బు కట్టలు.. కారు నిండా డబ్బులే.. గుట్టుచప్పుడు కాకుండా బళ్లారి నుంచి అనంతపురం మీదుగా బెంగళూరు తరలిస్తున్న డబ్బుల కట్టలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి జిల్లా సిరిగుప్పలో సివిల్ కాంట్రాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన వెర్నా కారులో రూ. 1.75 కోట్లు తరలిస్తుండగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన విడపనకల్లు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఆ తరుణంలో కృష్ణారెడ్డి ఖాకీలకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.? అంత డబ్బు ఎలా వచ్చింది.? అనే దానిపై పోలీసులు ప్రశ్నించగా.. కృష్ణారెడ్డి దగ్గర నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో భారీగా నగదు అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో భారీగా పట్టుబడ్డ నగదు సీజ్ చేసి.. అతడ్ని పోలీస్ స్టేషన్ తరలించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపుతోంది.