AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ జిల్లాలో బెల్లం అమ్మకాలపై ఆంక్షలు.. కలంకారి పరిశ్రమలు మూసివేత

ఎస్‌ఈబీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు బెల్లం అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. సారా తయారీదారులు దొరికినప్పుడు బెల్లం కొనుగోలు చేసిన దుకాణదారుడి వివరాలు సేకరిస్తున్నారు.

Andhra Pradesh: ఆ జిల్లాలో బెల్లం అమ్మకాలపై ఆంక్షలు.. కలంకారి పరిశ్రమలు మూసివేత
No Sale Board For Jaggery
Surya Kala
|

Updated on: Jun 07, 2022 | 6:40 AM

Share

Andhra Pradesh: ఇక్కడ బెల్లం అమ్మబడదు.. మీరు వింటుంది నిజమే. ఆశ్చర్యంగా ఉన్నా..పెడన నియోజకవర్గంలో బెల్లంపై ఆంక్షలు అమలవుతున్న మాట వాస్తవమే..సారా తయారీని అరికట్టడానికి ఎక్కువ మొత్తంలో క్రయవిక్రయాలపై ఎస్‌ఈబీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో బెల్లం అమ్మాలన్నా, కొనాలన్నా భయపడిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఎందుకొచ్చిన గొడవలే.. అనుకుంటూ చాలామంది షాపుల యజమానులు బెల్లం అమ్మబడదంటూ బోర్డు పెట్టేస్తుండగా, అసలు బెల్లం దొరక్క సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

పెడన మున్సిపాలిటీలోనూ, పెడన, బంటుమిల్లి మండలాల్లోని గ్రామాల్లోనూ ఇప్పుడు బెల్లం దొరకట్లేదు. నాటుసారా తయారీకి పెద్ద మొత్తంలో బెల్లం వినియోగిస్తుండటం, దానిని కట్టడి చేయడం సవాల్‌గా మారడంతో ఎస్‌ఈబీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు బెల్లం అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. సారా తయారీదారులు దొరికినప్పుడు బెల్లం కొనుగోలు చేసిన దుకాణదారుడి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు.. సారా తయారీ, అమ్మకందారులను ఏ1 ముద్దాయిలుగా, వారికి బెల్లాన్ని సర ఫరా చేసిన వ్యాపారులను ఏ2గా గుర్తిస్తున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ వ్యాపారులు బెల్లం విక్రయాలను నిలిపివేశారు…

బంటుమిల్లి, పెడన ప్రాంతాల్లో బోర్డులు కూడా పెట్టారు. దీంతో ప్రజలతో పాటు పశుదాణా, స్వీట్లు, కలంకారీ వస్ర్తాల తయారీదారులు బెల్లం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

సారాను అరికట్టే చర్యలు జిల్లాలో నాటుసారా తాగడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. దీంతో సారా తయారీ, అమ్మకాల కట్టడి పోలీస్‌, ఎక్సైజ్‌, ఎస్‌ఈబీ అధికారులకు సవాల్‌గా మారాయి. సారా రూపుమాపడంలో విఫలమైన అధికారులు దిక్కుతోచని స్థితిలో వ్యాపారులపై ఒత్తిడి పెంచారు. సారా ఎక్కడ దొరికినా సంబంధిత వ్యక్తిని పట్టుకుని బెల్లం అమ్మకందారుడి వివరాలు సేకరిస్తున్నారు. సదరు వ్యాపారిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి హెచ్చరిస్తున్నారు…

తయారీదారులను వదిలేసి.. వ్యాపారులపై ఉక్కుపాదం సచివాలయ పోలీసులు, వలంటీర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో సారా తయారీ, అమ్మకం దారులను, బెల్టుషాపులను గుర్తించలేకపోతున్నారు. సారా తయారీ, రవాణా కట్టడికి బంటుమిల్లిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వల్ల దాడులు నామమాత్రంగానే జరుగుతున్నాయి. రామవరపుమోడీలో ఏర్పాటుచేసిన పరివర్తన కార్యక్రమం విఫలమైందని ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. సారా తయారీ అరికట్టలేని అధికారులు వ్యాపారులపై ఒత్తిడి పెంచి ఆంక్షలు విధించడంతో బెల్లం అమ్మకాలు ఆపేశారు. ఆధార్‌ కార్డు ఉంటేనే బెల్లం అమ్ముతామని, కొన్నిచోట్ల అసలు బెల్లం లేదని నోటిమాటతో చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో అవసరాలకు తగ్గట్టు మార్కెట్‌లో బెల్లం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వీట్‌ షాపుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎప్పుడో అమ్మిన బెల్లానికి ఇప్పుడు కేసులు రాస్తుండటంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

చిన్న మొత్తంలో అమ్మకాలపై ఆంక్షల్లేవ్‌ అంటున్నారు పోలీసులు..దీనిపై స్థానిక ఎస్సై పైడిబాబు.. సారా తయారీ అరికట్టడంలో భాగంగా పెద్ద మొత్తంలో బెల్లం కొనుగోలు జరిగితే బిల్లు తప్పనిసరిగా ఉండాలని, ఆధార్‌ కార్డు ఉంటేనే బెల్లం అమ్మాలని సూచించారు. సారా తయారీదారులకు బెల్లం అమ్మితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. చిన్న మొత్తంలో బెల్లం అమ్మకాలకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తెలిపారు. సారా తయారీని అరికట్టడానికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. .

Reporter: Siva kumar, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..