Chinta Mohan: ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది గులాంనబీ ఆజాదే.. ఇప్పుడు మోడీతో.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు..
మాజీ ఎంపీ చింతా మోహన్.. ఏపీ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. ఏపీని బయటి రాష్ట్రాల్లో అబద్ధాల ప్రదేశ్ అంటున్నారన్నారు. అసెంబ్లీలో అంతా అబద్ధాలేనంటూ విమర్శించారు.
Congress leader Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది గులాంనబీ ఆజాద్.. ఆయన మోడీతో వారానికి ఒకసారి కాంటాక్ట్‌లో ఉంటారు.. అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీని నాశనం చేసిన ఘనత కూడా గులాంనబీ ఆజాద్ కే దక్కుతుందంటూ చెప్పారు. తాను ఇచ్చిన ఫార్ములా ఫాలో అయి ఉంటే రాజీవ్ గాంధీ బతికి ఉండేవారంటూ గుర్తుచేశారు. 1974 నుంచి చంద్రబాబు, తాను కాంగ్రెస్‌లో ఉన్నామని.. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఏపీలో ప్రజలు పరుగులెత్తే వారంటూ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. 2024లో బిజెపీకి 100 సీట్లు దాటి రావంటూ పేర్కొన్నారు. ఈ మేరకు చింతా మోహన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాము తెచ్చిన పరిశ్రమలు మాత్రమే ఉన్నాయన్నారు. దేనిమీద లేదు ట్యాక్స్.. గాలి మీద తప్ప అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. నిన్న మొన్నటి దాకా రోడ్లు ఊడ్చిన అదానీ కుబేరుడు ఎలా అయ్యాడంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు బీజేపీ సాధించింది ఎనిమిది చిరుతలు మాత్రమేనంటూ ఎద్దెవా చేశారు. బిజెపీ పులులను తీసుకొచ్చి గొప్పలు చెపుతోందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలైన సర్దార్ పటేల్, నేతాజీ బొమ్మలు పెట్టారు.. బీజేపీకి స్వతంత్ర ఉద్యమంలో నాయకులు లేరా..? అంటూ చింతా మోహన్ పేర్కొన్నారు. బీజేపీ కల్తీ పనులు చేస్తోందని.. 2024లో యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. యూపీఏ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. చైనా సరిహద్దుల్లో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందంటూ కేంద్రంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతా మోహన్.. ఏపీ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. ఏపీని బయటి రాష్ట్రాల్లో అబద్ధాల ప్రదేశ్ అంటున్నారన్నారు. అసెంబ్లీలో అంతా అబద్ధాలేనంటూ విమర్శించారు. రాజధాని నగరం రాష్ట్రంలో పూర్తిగా ఆగిపోయిందని.. పోలవరం కాంగ్రెస్ ఇచ్చిన వరమన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం అదానీ రాష్ట్రంగా మారిపోతోందన్నారు. ఏమీ లేకుండా ఒకప్పుడు నిలబడ్డ అదానీ ప్రపంచ కుబేరుడు కాబోతున్నాడన్నారు. దేశంలో 60 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారని.. రాష్ట్రంలో ఒక కోటి మంది ఆకలితో నిద్రపోతున్నారన్నారు. విజయవాడ లో 2 లక్షల మంది అకలితో అలమటిస్తున్నారని చెప్పారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ దోచుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎర్ర చొక్కాలు, ఖద్దరు చొక్కాలు లేకుండా పోయాయని.. దీంతో అబద్ధాలు వినబడుతున్నాయంటూ విమర్శించారు.
ఉపాధ్యాయులను విద్యా దీవెన పేరుతో సాక్సులు, బెల్టులు ఇవ్వడానికి పంపుతున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో విద్యా ప్రమాణాలు నాశనం అయిపోయాయని.. డాక్టర్లు రోగుల నాడి పట్టుకోవడం మానేసారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి ఏపిలో నిల్ అంటూ విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి