YS Jagan: సీఎం జగన్ ‘ముందస్తు’ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్.. సెకండ్ లిస్ట్‌లో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వ్యూహాలతో ముందుకెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్‌లు ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అక్కడి ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

YS Jagan: సీఎం జగన్ ‘ముందస్తు’ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్.. సెకండ్ లిస్ట్‌లో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు..?
Ys Jagan
Follow us
S Haseena

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 16, 2023 | 2:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వ్యూహాలతో ముందుకెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్‌లు ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అక్కడి ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వాటి ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులు, అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ నేతలతో ఉన్న సంబంధాల ఆధారంగా ఇంచార్జిలపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ బాస్.. ఒకవైపు ఈ కసరత్తు జరుగుతుండగానే కేబినెట్ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. గతంలో కంటే ఒక 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ ఉండవచ్చని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పెంచేసాయి. 2019లో మార్చి పదో తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. సీఎం కామెంట్స్ చూస్తే ఫిబ్రవరి మూడో వారంలో లేదా నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ నోట ముందస్తు మాట రావడంతో వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

రెండో లిస్ట్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయో.. ఎమ్మెల్యేల్లో టెన్షన్..

ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల పనితీరు ఆధారంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో అలాంటి వారిని మార్చేసి.. వేరే వారికి బాధ్యతలు ఇచ్చేలా జగన్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మొదటి విడత 11మందిని మార్పు చేశారు సీఎం.. వీరిలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేదు.. ఆయా అభ్యర్థుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మరికొంత మందిని వేరే నియోజకవర్గాలకు పంపించారు. ఇలా సీటు కోల్పోయిన సిట్టింగ్ లలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. ప్రజల్లో ఆయా ఎమ్మెల్యేలపై సరైన అభిప్రాయం లేనందునే సీటు ఇవ్వడం లేదని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఇక ముగ్గురు మంత్రులను కూడా వేరే నియోజకవర్గాలకు మార్పు చేశారు వైసీపీ అధినేత.. తాజా పరిస్థితులతో మిగిలిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. కేబినెట్ భేటీ తర్వాత కూడా చాలామంది మంత్రుల్లో ఇదే టెన్షన్ కనిపిస్తుండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండో లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి. తమకు సీటు వస్తుందా? సర్వేల్లో ఏముంది? ఏ జిల్లాలో ఎలాంటి మార్పు ఉంటుంది..? అనే ఆందోళనలో పడిపోయారు వైసీపీ ఎమ్మెల్యేలు.. మొదటి విడతలో ఉమ్మడి గుంటూరుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్.. సెకండ్ లిస్ట్ కోసం సీటు లేని అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తున్నారని తెలిసింది. సెకండ్ లిస్ట్‌లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. సీఎం ముందస్తు ఎన్నికల ప్రకటన తర్వాత ఏ క్షణమైనా రెండో జాబితా విడుదల అయ్యే ఛాన్స్ ఉందని ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు.

రెండు, మూడు రోజుల్లో మరో జాబితా విడుదలకు కసరత్తు..

ఈ నెలాఖరు నాటికి అన్ని స్థానాలపై క్లారిటీ ఇచ్చేలా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.. జనవరి నుంచి ప్రజాక్షేత్రంలోనే అభ్యర్థులు ఉండేలా ముందుకు వెళ్తున్నారు. అందుకే రెండు రోజుల్లో మరో జాబితా ద్వారా అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి సీటు విషయంలో ఫోన్లు అందుకున్న నేతలు తాడేపల్లిలో పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఒకసారి ప్రకటన చేస్తే మళ్లీ ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు సీఎం ముందస్తు వ్యాఖ్యలతో వైసీపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది.. అయితే, ఎవరి సీటు ఉంటుంది.. ఎవరి సీటు ఊడుతుంది..? అనేదానికి క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..