Summer Safety Tips: ఎండ వేడి నుంచి ఉపశమనం కావాలా.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే
వేసవిలోకి పూర్తిగా ప్రవేశించకుండానే భానుడి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత రికార్డ్ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి వేసవిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎండతీవ్రతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేడపైన, ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలని, ఇవి ఇంటిని చల్లగా ఉంచడంతో సహాయపడుతాయని, అలాగే ఉష్ణతాపాన్ని తగ్గించడంలోనూ ఇవి సహాయపడుతాయని తెలిపారు. అందుకే ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలన్నారు.
ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS , ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ప్రాణ నష్టం జరగకుండా చర్యలు
విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.
ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడనున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
