బస్సు యాత్ర ముగియగానే మళ్ళీ జనంలో సీఎం జగన్.. ఈసారి ఎలా ప్లాన్ చేశారంటే..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభలు ముగిసిన వెంటనే జిల్లాల వారీగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభలు ముగిసిన వెంటనే జిల్లాల వారీగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు రాయలసీమలో దాదాపు సగంపైగా జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలతో మమేకం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ముగిసిన వెంటనే మిగతా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను గుర్తించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెండింగ్లో ఉన్న కొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్ఠి సారించారు. మేమంతా సిద్ధం యాత్ర జరిగిన నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల మీదగా త్వరలోనే మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన వెంటనే ఈ నియోజకవర్గాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఒక్కో రోజు నాలుగు నుంచి ఆరు నియోజకవర్గాల్లో పర్యటించి సభలో సమావేశాల్లో పాల్గొన బోతున్నారు సీఎం జగన్. అందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటించాలి.. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఆధారంగా పర్యటన ఉండేలాగా ప్లాన్ రూపొందిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించే నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ప్రజలతో ముఖాముఖిలో పాల్గొనే లాగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు భారీ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. మేమంతా సిద్ధం యాత్రలో రోజు మార్చి రోజు బహిరంగ సభలు ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. ఈ మేమంతా సిద్దం యాత్ర ముగిసిన వెంటనే మరో 25 రోజులకు పైగా పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు వైసీపీ అధినేత. అందుకోసం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లేలా వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన యాత్రలో ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకుంటున్నారు. తన పర్యటనకు ముందు.. పర్యటనకు తర్వాత వచ్చిన మార్పులను స్పష్టంగా గమనిస్తున్నారు. ఇలాగే నామినేషన్ వరకు ప్రజల్లో ఏదో ఒక విధంగా మమేకం అయి పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నియోజకవర్గాల వారీగా పర్యటనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే క్యాడర్లో మరింత జోష్ నిండి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..