CJI NV Ramana: స్వగ్రామం పొన్నవరంలో CJI ఎన్వీరమణకు ఘనసత్కారం.. విజయవాడలో సీజేఐతో సీఎం జగన్ భేటీ

తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకూ ఐకమత్యమే ఔషధమని చెప్పారు.

CJI NV Ramana: స్వగ్రామం పొన్నవరంలో CJI ఎన్వీరమణకు ఘనసత్కారం.. విజయవాడలో సీజేఐతో సీఎం జగన్ భేటీ
Cji Nv Ramana
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 25, 2021 | 4:09 PM

CJI NV Ramana AP tour: తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకూ ఐకమత్యమే ఔషధమని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సొంత ఊరిలో పర్యటించారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో అడుగుపెట్టారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఆయన హాజరవుతారు.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హోదాలో తొలిసారి పొన్నవరం వచ్చిన జస్టిస్‌ ఎన్వీరమణకు మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ యంత్రాంగం ఘనస్వాగతం పలికారు. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. అనంతరం శివాలయంలో ఎన్వీరమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఎన్వీ రమణ దంపతులను ఘనంగా సన్మానించారు. పుట్టిన ఊరిని, కన్నతల్లిని ఎన్నటికీ మరిచిపోకూడదని జస్టిస్‌ NV రమణ అన్నారు. ఊరి ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరానన్నారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీరకపోవడం బాధాకరమన్నారు. దేశ,విదేశాల్లో తెలుగువారి విజయాలు, గొప్పతనం విని తెలుగువాడిగా గర్వపడతానన్నారు జస్టిస్‌ ఎన్వీ రమణ.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగిసింది. పలు అభివృద్ధికార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. ముందుగా నోవాటెల్‌ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

కాగా, అంతకుముందు సీజేఐ ఎన్వీ రమణ దంపతులు విజయవాడ దుర్గమ్మను సేవలో పాల్గొన్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సంప్రదాయ వస్త్రధారణలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై రమణ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులతో పాటు ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్ ఎన్వీ రమణను స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు.

ఆదివారం సీజేఐ విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం గుంటైరు నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగే జ్యుడిషీయల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికి వెళతారు. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు.

Read Also…  Omicron Cases In India: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. నేటి రాత్రి నుంచి అక్కడ కర్ఫ్యూ