AP: అమిత్‌షా ముందు బాబు పెట్టిన 2 ఆప్షన్లు.. బీజేపీ దగ్గరున్న 3 ఆప్షన్లు ఇవే..!

మహా కూటమి...మేడిన్ ఢిల్లీ! చంద్రబాబు అమిత్‌షా ముందు పెట్టిన రెండు ఆప్షన్లు. బీజేపీ దగ్గరుండే మూడు ఆప్షన్లు.. ఇక్కడే ఆగిపోయింది కూటమి సమాలోచన. ఈ చిక్కుముడిని విప్పడానికే అన్నట్టు ఢిల్లీ టూరేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఇదే టైమ్‌లో జగన్ కూడా హస్తిన ఫ్లైటెక్కారు. టోటల్‌గా ఏపీ విపక్ష కూటమి నిర్మాణం ఢిల్లీకి చేరింది. 12వ తేదీ తర్వాతే క్లయిమాక్స్ అట.

AP: అమిత్‌షా ముందు బాబు పెట్టిన 2 ఆప్షన్లు.. బీజేపీ దగ్గరున్న 3 ఆప్షన్లు ఇవే..!
Amit Shah - Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 08, 2024 | 9:54 PM

ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఏపీ పొలిటికల్‌ గేమ్‌.. దాదాపు క్లయిమాక్స్‌కి చేరుకుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలూ ఓవర్‌ టు ఢిల్లీ అంటూ రాజధాని బాట పట్టేశారు. బుధవారం అమిత్‌షా పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. అర్థరాత్రి మంతనాల తర్వాత ఏమని తేల్చారు.. పొత్తు కహానీ ఎందాకా వచ్చింది అనే ప్రశ్నల్ని ప్రశ్నలుగానే ఉంచుతూ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ రిటర్న్ అయ్యారు బాబు. జనసేన అధ్యక్షుడు పవన్‌తో సమావేశమై, అమిత్‌షాతో తన మంతనాల సమాచారాన్ని వివరించారట. ఆ వెంటనే.. వితౌట్ గ్యాప్‌… పవన్‌కల్యాణ్ ఢిల్లీ టూర్ షురూ చేశారు.

ఇదే గ్యాప్‌లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా ఢిల్లీకి ఆకస్మిక పర్యటన పెట్టుకోవడం.. పొలిటికల్ సీన్లు మరింతగా రక్తి కట్టేశాయి. మోదీతో భేటీ కానున్న జగన్.. అక్కడ ఏం మాట్లాడతారు.. ఏపీ రాజకీయాల ప్రస్తావన వస్తుందా? అంటూ హెడ్‌లైన్ వార్తల నిండా క్వశ్చన్‌మార్కులే. ఈ సందేహాస్పద రాజకీయం మరో నాలుగురోజుల పాటు కంటిన్యూ ఔతుందట. ఎందుకంటే.. బీజేపీ ఢిల్లీ పెద్దల బిజీ షెడ్యూల్‌ కారణంగా… ఏపీలో విపక్షాల పొత్తు కహానీ పెండింగ్‌లో పడింది. ఈనెల 12 తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుందనేది ఢిల్లీ తాజా ఖబర్.

చంద్రబాబు-అమిత్‌షా మధ్య జరిగిన మంతనాల సారాంశమేంటి? ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే ఉన్న ఈ మూడు పార్టీల పొత్తుపై ఎవరి మనోగతం ఏ రకంగా ఉంది? ఇద్దరి చర్చలతో పొత్తు కథ ఎంతమేర ముందుకు జరిగింది..? అనే అంశాలపై ఎవరి ఊహాహానాలు వాళ్లవి. కానీ.. అమిత్‌షా-చంద్రబాబు మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నది మాత్రం క్లియర్. అమిత్‌షా ఎదుట 2 ఆప్షన్లను పెట్టారట చంద్రబాబు. ఆప్షన్-1 – ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకోవడం. ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి మద్దతునివ్వడం. సో.. ఎన్‌డీఏలో చేరాలా వద్దా అనే లాజిక్‌ను ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంచాలన్నది బాబు ఆలోచన.

ఇక… బాబు దగ్గరుండే ఆప్షన్-2.. ఎన్నికలకు ముందే 3 పార్టీలూ పొత్తు పెట్టుకోవడం. ఏ పార్టీకెన్ని సీట్లు లెక్క తేల్చుకుని కలిసే ఎన్నికలకు వెళ్లడం. బాబు ఇచ్చిన ఈ రెండు ప్రపోజల్స్‌ని అటుంచి… బీజేపీ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి 3 ఆప్షన్లను సిద్ధం చేసుకుంది. ఆప్షన్ 1 – టీడీపీ- జనసేనతో పొత్తు పెట్టుకోకుండా విడిగానే పోటీ చేయడం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ క్యాడర్‌ని సమాయత్తం పరిచింది బీజేపీ అధిష్టానం. ఇక ఆప్షన్ 2 – టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా మిత్రపక్షం జనసేనను నిలువరించి.. అలా విడిపడి ఒంటరైన జనసేనను తమతో కలుపుకుని ఎన్నికలకు వెళ్లడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలాచాలా సంక్లిష్టం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీతో ఫెవికాల్ బంధాన్నేర్పర్చుకుని, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారాలతో జనంలోకెళ్లింది జనసేన. చంద్రబాబుతో కటీఫ్ చెప్పి తమతో రమ్మని బీజేపీ కనుక ఆఫరిస్తే… పవన్‌కల్యాణ్ మైండ్‌ మళ్లీ బ్లాంకవ్వడం ఖాయం.

ఇక బీజేపీ దగ్గరుండే థర్డ్ అండ్ ఫైనల్‌ ఆప్షన్.. జనసేన, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని మరోసారి మహాకూటమిగా ముందుకెళ్లడం. ఈ అనుభవం ఆల్రెడీ 2014 ఎన్నికల్లో ఉంది. కానీ.. సీట్ల పంపకం దగ్గరే మెలిక పడుతోందని, మూడు పార్టీల పొత్తు కుదిరితే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలు డిస్టర్బ్ అవుతాయని మూడు పార్టీలు భావిస్తున్నాయి. కానీ.. పవన్‌ ఢిల్లీ టూర్ తర్వాత.. శుభవార్తతోనే తిరిగొస్తారనే ఆశలైతే జనసేనలో గట్టిగానే ఉన్నాయి. కానీ.. ఏపీలో రాక్షస పాలనను అంతమొందించాలంటే.. విపక్షాల ఐక్యత వర్థిల్లాల్సిందే అంటూ మూస మాటలే తప్ప.. పొత్తు నిర్మాణంపై జనసేనలో కూడా అంతకుమించి క్లారిటీ లేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదు.. ఇదే పవన్ దగ్గరుండే సింగిల్‌ పాయింట్ ఎజెండా. దాంతోనే రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు జనసేన అధినేత. కానీ.. అది మాటల్లో చెప్పినంత సులువు కాదని ఇప్పుడిప్పుడే ఆయనకు తెలుస్తోంది. ఏడాది కాలంగా తానూ- బీజేపీ కలిసే ఉన్నప్పటికీ, చంద్రబాబుకు- బీజేపీకీ మధ్య దూరం తగ్గించడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ వేసిన ఢిల్లీ టూర్‌… మూడు పార్టీల పొత్తుకు శుభం కార్డు వేస్తుందా? టీడీపీ-బీజేపీ మధ్య పవన్‌ చేస్తున్న రాయబారం ఫలిస్తుందా? చంద్రబాబు ఇచ్చిన ఆప్షన్స్‌నీ, అమిత్‌షా పెట్టిన కండిషన్స్‌నీ పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? ఇలా పిచ్చిలేపే చిక్కుప్రశ్నలతో మూడు పార్టీల క్యాడర్‌కీ నరాలు తెగిపోతున్నాయిక్కడ.

ఇదే ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర పరిణామం జగన్ ఢిల్లీ టూర్. మోదీతో భేటీ కాబోతున్న జగన్.. రాష్ట్రం గురించి మాట్లాడతారు.. రాజకీయ అంశాలు ప్రస్తావిస్తారా…? వీళ్లిద్దరి భేటీ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది? అంటూ అధికార వైసీపీని కూడా అలర్ట్ అయింది. ఏపీ మొత్తాన్నీ ఉడికిస్తున్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే 12వ తేదీదాకా ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..