AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor attack: నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చేశారు.. వైసీపీ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైర్..

కురబల కోట మండలం అంగళ్లులో టీడీపీ నాయకులపై దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై దాడిని ఖండించారు.

Chittoor attack: నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చేశారు.. వైసీపీ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైర్..
Shiva Prajapati
|

Updated on: Dec 11, 2020 | 8:35 PM

Share

కురబల కోట మండలం అంగళ్లులో టీడీపీ నాయకులపై దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంగళ్లులో టీడీపీ నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మధుబాబు మరో ముగ్గురి వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పాలనకు గండికొట్టారని విమర్శించారు.

జగన్ అండతో వైసీపీ ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతోనే నిందితులంతా పెట్రేగిపోతున్నారంటూ చంద్రబాబు నిప్పులుచెరిగారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోందన్నారు. మృతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే నాయకులపై దాడి చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇది ఫాసిస్ట్ చర్యగా అభివర్ణించారు. వైఎస్ జగన్ ఏడాదిన్నర పాలనలో ఎక్కడ చూసినా అశాంతి, అభద్రతే ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేవని, నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారంటూ తీవ్రపదజాలంతో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.