ఛాలెంజింగ్‌గా పోలింగ్, మూడంచెల భద్రతా వ్యవస్థ, 20 కి.మీ పైన ప్రయాణించి కేంద్రాలకు తరలివచ్చిన గిరిజన బాలింతలు

మావోయిస్టుల కంచుకోట విశాఖ మన్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ని విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఛాలెంజింగ్ గా నిర్వహిస్తోంది. పాడేరు డివిజన్..

ఛాలెంజింగ్‌గా పోలింగ్, మూడంచెల భద్రతా వ్యవస్థ, 20 కి.మీ పైన ప్రయాణించి కేంద్రాలకు తరలివచ్చిన గిరిజన బాలింతలు
Follow us

|

Updated on: Feb 17, 2021 | 2:04 PM

మావోయిస్టుల కంచుకోట విశాఖ మన్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ని విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఛాలెంజింగ్ గా నిర్వహిస్తోంది. పాడేరు డివిజన్ పరిధిలో మూడంచెల భద్రత వ్యవస్థ నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు చోట్ల ఏకగ్రీవం కాగా, పెదబయలు మండలం, గిన్నెలకోట పంచాయతీకి నామినేషన్ దాఖలు చేయని కారణంగా అక్కడ ఎన్నిక జరగడం లేదు. దీంతో పాడేరు డివిజన్ పరిధిలో 237 సర్పంచ్ లు, 1491 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పోలింగ్.. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మూడు అంచెల భద్రత వ్యవస్థ నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి. 80 కి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ వ్యూహాత్మక భద్రతను ఏర్పాటు చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 9 పంచాయతీలకు, పొరుగునున్న పంచాయతీ కేంద్రాలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. జీ.కే.వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ పోలింగ్ కేంద్రం ను 22 కిలోమీటర్ల దూరంలో గల దారకొండ పంచాయతీ కేంద్రంకి మార్పు చేయడంతో ఓటర్లకు బస్సులను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జీపుల టాపు పైన కూర్చుని కొన్ని చోట్ల ఓటర్లు తరలి వెళ్తున్నారు. ఇక ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులో వ్యాపారులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ ముగిసేంత వరకు స్వచ్చంధంగా దుకాణాలు మూసి వేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం వరకు స్వచ్చంధ బంద్ పాటిస్తున్నారు.

జీకే వీధి మండలం దుప్పిల వాడ పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు చంటి బిడ్డలతో వలసగడ్డకి చెందిన గిరిజన బాలింతలు తరలివచ్చారు. వలసగడ్డ నుంచి దుప్పిలవాడ పంచాయతీ కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ వాహనాలు, బస్ లలో ప్రయాణించి మరీ పోలింగ్ బూత్ లకి గిరిజన బాలింతలు తరలి వచ్చారు. అరకు వైసీపీ ఎమ్మెల్యే చిట్టి, టిడిపి మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ కిడారి శ్రావణ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొయ్యూరు మండలం, శరభన్నపాలెంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

Read also : వరుస ఎన్నికల నేపథ్యాన మీమాంసలో ఏపీ సర్కారు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల క్రతువు ఎప్పుడు, ఎలా అనేదానిపై కసరత్తు