Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళా బ్యాంకు పేరుతో భారీ మోసం.. కోట్లు దోచేసి, మహిళలకు కుచ్చుటోపి!

మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.. ఈ మధ్య మనమంతా తరచూ వింటున్న హెచ్చరికలు ఇవి. ఇలాంటి వాటితో అప్రమత్తమవుతున్న చాలామంది బ్యాంకింగ్ విషయాల్లో ఎక్కువగా బ్యాంకింగ్ సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. అయితే కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించాల్సిన బ్యాంకింగ్ సిబ్బందే సైబర్ మోసగాళ్ల తరహాలో మారితే ఏం జరుగుతుంది.

Andhra Pradesh: మహిళా బ్యాంకు పేరుతో భారీ మోసం.. కోట్లు దోచేసి, మహిళలకు కుచ్చుటోపి!
Janani Mutual Cooperative Credit Savings Society
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Mar 21, 2025 | 7:22 PM

మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.. ఈ మధ్య మనమంతా తరచూ వింటున్న హెచ్చరికలు ఇవి. ఇలాంటి వాటితో అప్రమత్తమవుతున్న చాలామంది బ్యాంకింగ్ విషయాల్లో ఎక్కువగా బ్యాంకింగ్ సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. అయితే కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించాల్సిన బ్యాంకింగ్ సిబ్బందే సైబర్ మోసగాళ్ల తరహాలో మారితే ఏం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌‌లో ఇలాంటి అనుభవమే మహిళలకు ఎదురైంది. ఎంతో నమ్మకంగా వ్యవహరించిన మహిళా బ్యాంక్ సీఈవో మహిళల అకౌంట్‌ నుంచి ఏకంగా కోట్లు రూపాయలు కాజేసేందుకు భారీ స్కెచ్ వేశాడు.

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈవో వెంకటరమణ గత 20 రోజులుగా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలు ఒక్కొక్కరు లక్షల్లో సొమ్మును ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేయడంతో ఆ డబ్బు తిరిగి వస్తుందో రాదోనని తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు మహిళలు సీఈవో స్వస్థలం కడపకు వెళ్లి అతని ఇంటి దగ్గర ఆరా తీయగా సీఈవో రమణ ఆచూకీ లేకపోవడంతో వారికి నిరాశ మిగిలింది.

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల బాలసుబ్బయ్య ఈ సంస్థలో ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. బాండ్లు మెచ్యూర్ కావడంతో అతనికి వడ్డీతో కలిపి సుమారు 7 లక్షల 40 వేలు రావాల్సి ఉంది. దీంతో జననీ బ్యాంకు సిబ్బంది బాల సుబ్బయ్యకు చెక్కు ఇచ్చారు. నగదు డ్రా చేసుకునేందుకు అతని సేవింగ్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళగా జననీ మహిళా బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది. మహిళా బ్యాంకు సీఈఓ వెంకటరమణ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. 20 రోజుల నుండి అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలావుంటే, కోయిలకుంట్ల పట్టణానికి చెందిన హరిప్రియ అనే మహిళను బ్యాంకు ట్రెజరర్‌గా నియమిస్తున్నానని చెప్పి నమ్మబలికి ఆమె నుండి 8 తులాల బంగారం, ఐదు లక్షల రూపాయల నగదు తీసుకున్నారు. బంగారం లాకర్‌లో ఉంచుతానని చెప్పి, అధిక వడ్డీ పేరుతో మోసం చేశాడని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోసపోయిన ఖాతాదారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణ అందుబాటులో లేకపోవడంతో డిపాజిటర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి బ్యాంకు సిబ్బందిని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించగా.. సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యి వెళ్ళాడని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. గత 20 రోజులుగా అందుబాటులో లేరని వారు పోలీసులకు తెలిపారు.

బ్యాంకు సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు … తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి అంటున్నారు. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కడప పట్టణానికి చెందిన వెంకటరమణ స్థానికంగా ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని నంద్యాల జిల్లాలో 5 బ్రాంచ్ ల ఏర్పాటు చేశాడు. కోయిలకుంట్ల తోపాటు చాగలమర్రి, బనగానపల్లె, నంద్యాల తదితర చోట్ల జననీ మాక్స్ లిమిటెడ్ సంస్థ పేరుతో జనని పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం కార్యాలయాలు తెరిచాడు. ఆ సంస్థల ద్వారా డిపాజిట్లపై రూపాయి వడ్డీ, ఆ డిపాజిట్ నగదుపై రుణం తీసుకుంటే రూ. ఒకటిన్నర చొప్పున వడ్డీ వసూలు చేస్తూ నాలుగు సంవత్సరాలు ఈ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇలా వేలాది మంది మహిళల నుండి సుమారు 2 కోట్ల మేరకు భారీ మొత్తం లో డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ సంస్థల్లో డబ్బు పొదుపు చేసిన డిపాజిటర్లు ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో వారికి చెల్లించేందుకు నగదు అందుబాటులో లేకపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చివరికి డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో సీఈవో వెంకట రమణ డిపాజిటర్ల నగదు, బంగారం స్వాహా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటరమణ ఆచూకీ కోసం వేట ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..