TTD: దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో తిరుపతి వెంకన్న ఆలయం! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఈ మేరకు దిశానిర్దేశం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించినట్లయితే ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని, శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశించారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే ఆలయ నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ మేరకు టీటీడీకి దిశా నిర్దేశం చేశామన్నారు సీఎం. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆలయాలు నిర్మిస్తామని, అందుకోసం ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని అన్నారు. శ్రీవారి ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు.
టీటీడీలో అన్యమత ఉద్యోగులను వేరే శాఖలకు బదిలీ చేయడానికి ఆదేశాలిచ్చామాన్నారు. ఇతర మతస్థులు ఉంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్నారు. ఇతర మత సంస్థల్లోనూ హిందువులు పనిచేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవసేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. తానెప్పుడూ ప్రజాహితం కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని తెలిపారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఏడుకొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్ కు అప్పట్లో అనుమతిచ్చారని, 20 ఎకరాలు కేటాయించిన ఎకరాలతో పాటు 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు కేటాయింపులను రద్దు చేశామని వెల్లడించారు. ఈ ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు సీఎం చంద్రబాబు.
అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం
తిరుమల వెంకన్న భక్తులకు టీటీడీ అందజేసే అన్నప్రసాద వితరణకు సీఎం కుటుంబం ఒకరోజు అయ్యే ఖర్చును విరాళంగా అందజేసింది. సీఎం మనవడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా రూ.44 లక్షలను టీటిటిడి ఖాతాకు జమ చేసింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం కు చేరుకున్న సీఎం కుటుంబ సభ్యులు అన్నప్రసాదాలు వడ్డించారు. స్వయంగా సీఎం కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. భక్తులతో మాట్లాడి, టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు.