BRS Politics: తెలంగాణ నుంచి ఏపీలోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ కారు.. ఓ రేంజ్‌లో కౌంటర్స్ ఇస్తున్న ప్రత్యర్థి పార్టీలు..
తెలంగాణ నుంచి ఏపీలోకి దూసుకెళ్లింది బీఆర్ఎస్ కారు. అయితే, అక్కడి అధికార పార్టీ వైసీపీ మాత్రం బీఆర్ఎస్‌ను కేఏ పాల్ పార్టీతో పోలుస్తూ లైట్ తీసుకుంది.
తెలంగాణ నుంచి ఏపీలోకి దూసుకెళ్లింది బీఆర్ఎస్ కారు. అయితే, అక్కడి అధికార పార్టీ వైసీపీ మాత్రం బీఆర్ఎస్‌ను కేఏ పాల్ పార్టీతో పోలుస్తూ లైట్ తీసుకుంది. మరోవైపు బీఆర్ఎస్-వైసీపీ రెండూ ఒక్కతాను ముక్కలేనంటోంది బీజేపీ. అదే టైమ్‌లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పాత వివాదాలూ, కొత్త వాదాలు తెరపైకి వస్తున్నాయి. మరి వీటికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్పబోతోంది? ఆసక్తికర కథనం మీకోసం..
ఏపీ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి దుమారం రేపింది. అలా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించిందో లేదో.. ఇలా విమర్శలు షురూ చేసింది. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఏపీ అభివృద్ధి జరగలేదని అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు.. మాజీలు కూడా టచ్‌లో ఉన్నారన్నది బీఆర్ఎస్ వెర్షన్. ఈ కామెంట్స్‌పై అధికార వైసీపీ నుంచి కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు వస్తున్నాయి. బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు అంటూ పంచ్‌లు కురిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేసివాళ్లు.. విభజన చట్టం అమలుకు సహకరించిన వాళ్లు.. మళ్లీ ఏపీలో ఎలా అడుగుపెడతారంటూ సూటిగా ప్రశ్నిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్-వైసీపీ రెండూ ఒక్కటే అంటోంది ఏపీ బీజేపీ. వైసీపీ ఆఫీస్‌లోనే ఒక ఫ్లోర్ ఇస్తే సరిపోతుందని విమర్శించింది. పనిలో పనిగా కేసీఆర్‌ను ఏపీ ద్రోహిగా అభివర్ణించారు బీజేపీ నేతలు. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పటికే ముక్కోణపు పోరు నడుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
రంజుగా తెలంగాణ రాజకీయాలు..
తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఏపీ నేతలను చేర్చుకొని.. అక్కడ అధ్యక్షుడిని కూడా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు పలు ప్రశ్నలు సంధించారు. అసలు జాతీయ అధ్యక్షుడే లేని పార్టీ.. రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటించడం ఏంటని నిలదీసింది. తెలంగాణ ప్రజలే ఛీ కొడుతున్నప్పుడు.. ఇక విస్తరణకు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. అటు మహారాష్ట్ర బీజేపీ లీడర్లు కూడా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఆరోపిస్తోంది. తమ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఉత్తరాధిలో ఆప్‌ను తెరపైకి తెచ్చిన బీజేపీ.. సౌత్‌లో ఆ పనిని బీఆర్ఎస్‌కు అప్పగించిందని విమర్శిస్తోంది. కాగా, సంక్రాంతి తర్వాత మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది బీఆర్ఎస్. అన్ని రాష్ట్రాల్లోనూ శాఖల ఏర్పాటుపై ఫోకస్ చేస్తోంది. భవిష్యత్ మాదే అంటూ.. విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అటు ప్రతిపక్షాల నుంచి కూడా అంతే వేగంగా కౌంటర్లు పడుతున్నాయి. తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాయి పార్టీగా మారిపోయిందంటూ కార్నర్ చేస్తున్నాయి. జై తెలంగాణ అనేందుకు కూడా కేసీఆర్‌కు మనసు రావడం లేదంటూ.. ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి విపక్షాలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..