మద్యం స్టాక్ ఉంచుకునేలా ఆదేశాలివ్వండి మహా ప్రభో.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే
సాధారణంగా శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సంబంధిత సబ్జెక్టుకి పరిమితమై మాట్లాడుతుంటారు. అది రొటీన్‌గా ఉంటుంది. కానీ విష్ణుకుమార్ రాజు ప్రసంగాన్ని ప్రారంభిస్తే అందరూ చాలా ఆసక్తికరంగా వినే ప్రయత్నం చేస్తుంటారు.
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు శైలే వేరు. ఆద్యంతం ఆసక్తికర ఉపన్యాసాలు ఇవ్వడం విష్ణు కుమార్ కే చెల్లుతుంది. అత్యంత సహజమైన చిన్న విషయాలను కూడా తనదైన శైలిలో మరింత ఆసక్తికరంగా మలచడంలో తనకు తానే సాటి. సాధారణంగా శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సంబంధిత సబ్జెక్టుకి పరిమితమై మాట్లాడుతుంటారు. అది రొటీన్‌గా ఉంటుంది. కానీ విష్ణుకుమార్ రాజు ప్రసంగాన్ని ప్రారంభిస్తే అందరూ చాలా ఆసక్తికరంగా వినే ప్రయత్నం చేస్తుంటారు. శుక్రవారం(నవంబర్ 15) కూడా శాసనసభలో అలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసింది. అంతకుముందు ప్రైవేట్ వ్యక్తులకి రిటైల్ మద్యం షాపులు ఇచ్చే వ్యవస్థకి పుల్ స్టాప్ పెట్టి, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. మద్యం వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం అంటూ షాపులను తగ్గించి కొంతమేరకు ధరలను పెంచింది. అదే క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చాలా కట్టుబాట్లని పెట్టింది. అందులో ఒకటి ఒక్కొక్కరి దగ్గర ఆరు బాటిల్లకు మించి మద్యం నిల్వ ఉండకూడదు. అలా ఉంటే శిక్షార్హులు అని నిబంధన పెట్టింది. అది కేవలం నిబంధనకు మాత్రమే పరిమితం కాలేదు, అనేక మందిపై ఆరు బాటిల్ కంటే మించి మద్యం ఉన్న కేసులు కూడా నమోదు చేసింది. దీంతో నిరంతరం పార్టీల నిర్వహించే వాళ్ళు కానీ ఇతర బిజినెస్ కమ్యూనిటీ వర్గాలు కొంత ఇబ్బందులు పడ్డాయన్నది ఆరోపణ. దానిపైనే ఈరోజు విష్ణుకుమార్ రాజు శాసనసభలో చాలా ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
అసలు విష్ణు కుమార్ రాజు ఏమన్నారంటే..!
మద్యం పాలసీ లో కొన్ని మార్పులు చేయాలనీ, 6 మద్యం బాటిళ్లు మాత్రమే ఇళ్లలో పెట్టుకోవడానికి అనుమతి ఉందనీ, గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడనీ పెట్టుకోలేదనీ, మంచి మద్యం అక్కడా ఇక్కడా తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్ళు పెట్టుకొని మిగలినవి దాచిపెట్టమని ప్రెండ్స్ కు ఇచ్చేవాళ్లం అంటూ అందరినీ నవ్వించారు విష్ణు కుమార్ రాజు. అయితే వారు తమకు గిప్ట్ గా ఇచ్చారనుకొని ఆ బాటిల్స్ ఖాళీ చేసే వాళ్లనీ, ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హౌస్ లకైనా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖామంత్రులను కోరుతున్నానన్నారు. ఈ విషయం సభలో చెబితే బాగోదని మా వాళ్లు అన్నారనీ, అయితే ఇది అందరూ ఇబ్బంది పడే విషయం కాబట్టే అందుకే సభ దృష్టికి తీసుకువచ్చానన్నారు. దీంతో అందరూ మరొక్కసారి గట్టిగా నవ్వారు.
బడ్జెట్ లెక్కలు కరెక్టే నా..?
మద్యం పాలసీతో పాటు మిగతా అంశాల మీదా చాలా ఆసక్తికరమైన ప్రసంగాన్ని చేశారు విష్ణుకుమార్ రాజు. బడ్జెట్లో చాలా శాఖలకి చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చూపించారని ఇది సాధ్యమైనా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు మరి ఇంత ఆదాయం వస్తుంటే అప్పులు ఎందుకు అంటూ కూడా ఆయన తన అంతరాత్మని వివరించే ప్రయత్నం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్లు నుండి వచ్చే ఆదాయం రూ. 4,000 కోట్లు పెంచి చూపించారని, అది ఎలా సాధ్యమో చెప్పాలంటూ కోరారు. అధికార ఎన్డీఏ పక్షంలో భాగస్వామిగా కీలకమైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పార్టీ లీడర్ గా విష్ణుకుమార్ రాజు ఎక్స్‌ప్రెస్ చేసిన అనుమానాలు అందర్నీ మరోసారి ఆనందంలోకి దించాయి. రూ. 25,595 కోట్లు ఎక్సైజ్ ద్వారా వస్తుందని ఎక్సైజ్ మంత్రి కూడా చెప్పారనీ, అంటే లిక్కర్ లోనే వైసిపి రూ. 30వేల కోట్లు కొట్టేసిందన్న అనుమానం వస్తుందని, ఒకసారి దానిపై దృష్టి సారించాలని కోరారు విష్ణు కుమార్ రాజు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..