Andhra: ఇలాంటి పామును మీ ప్రాంతంలో ఎప్పుడైనా చూశారా.. తాచుపాము అనుకునేరు..
ప్రకాశం జిల్లా మేడపి టోల్‌ప్లాజా దగ్గర అరుదైన పాము కలకలం రేపింది. ఐదడుగుల పొడవున్న లేత గోధుమ, ఎరుపు రంగు చారల పామును చూసి టోల్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున దానిని పట్టుకుని సురక్షితంగా మైదాన ప్రాంతంలో వదిలేశారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర జాతీయ రహదారి పై ఉన్న టోల్ గేట్ దగ్గర అందరూ బిజీగా ఉన్నారు… అటూ, ఇటూ వాహనాలు టోల్ ట్యాక్స్‌లు చెల్లిస్తూ నిదానంగా కదులుతున్నాయి… ఇంతలో ఏదో అలికిడి, బుస్సు, బుస్సు మని శబ్దాలు రావడంతో అంత రద్దీలోనూ టోల్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు… అక్కడ గోడవారగా పాక్కుంటూ వెళుతున్న అరుదైన లేత గోధుమ, ఎరుపు రంగు చారలతో ఉన్న ఐదడుగుల పాము కనిపించింది… టోల్‌ట్యాక్స్ మాట దేవుడెరుగు పామును చూసి టోల్ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు… వెంటనే సమీపంలోని స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు.. టోల్‌ప్లాజా దగ్గరకు చేరుకున్న స్నేక్ క్యాచర్ పాముని పట్టుకుని మైదాన ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు… తీరా ఆరా తీస్తే అది చూసేందుకు భయంకరంగా కనిపిస్తున్నా, విషరహిత బ్యాండెడ్ రేసర్ పాముగా గుర్తించారు.
ఆకారపుష్టి, నైవేద్య నష్టి అంటే ఇదే…
బ్యాండెడ్ రేసర్ పాము అనేది భారతదేశంలో కనిపించే ఒక విషరహిత పాము… ఇది మనుషులకు ఎటువంటి హాని చేయదు కానీ, చాలా వేగంగా కదులుతుంది… దీని శరీర ఆకృతి సన్నగా, నునుపైన పొలుసులతో సుమారు 5 అడుగుల వరకు పెరుగుతుంది… పిల్ల పాములుగా ఉన్నప్పుడు వీటి శరీరంపై తెల్లటి చారలు స్పష్టంగా కనిపిస్తాయి… అయితే పాము పెరిగే కొద్దీ ఈ చారలు మసకబారి, పెద్దవయ్యాక శరీరం మొత్తం లేత గోధుమ, ఎరుపు-గోధుమ రంగులోకి మారుతుంది… పొట్ట భాగం లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది… ఇది నల్లతాచుతో పోలిక కలిగి ఉంటుంది…అయితే దీనికి నాగుపాములా పడగ ఉండదు… తల కూడా చిన్నదిగా ఉంటుంది… ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది… ప్రధానంగా పొడి నేలలు, వ్యవసాయ పొలాలు, పొదలు, నగర శివార్లలోని తోటలలో నివసిస్తుంది… ఇది పగటిపూట చురుగ్గా ఉంటూ ఎలుకలు, బల్లులు, కప్పలు, చిన్న పక్షి పిల్లలను తింటుంది.
అపోహలు…
పిల్ల పాముగా ఉన్నప్పుడు కట్లపాము లాగా, పెద్దయ్యాక నాగుపాము లేదా జెర్రిపోతు లాగా కనిపించడం వల్ల ప్రజలు దీన్ని విషపూరిత పాముగా పొరబడి చంపేస్తుంటారు… ఇది పూర్తిగా హానిచేయని పాము… వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షించబడిన జాతి… మన పరిసరాల్లో ఈ పాము కనిపిస్తే దానిని చంపకుండా స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా స్నేక్ హెల్ప్‌లైన్ వంటి సంస్థలకు సమాచారం అందించాలని స్నేక్ క్యాచర్ మల్లికార్జున సూచిస్తున్నారు.
