ఎల్‌నివో వల్ల పంట నష్టపోయారా..? వాట్సప్‌లో దరఖాస్తు చేస్కుంటే పరిహారం.. సింపుల్ ప్రాసెస్..
ఎల్‌నివో వల్ల వర్షాలు లేకపోవడం వల్ల మీరు పంట నష్టపోయారా..? లేదా తుఫాన్లు వల్ల మీ పంటకు నష్టం జరిగిందా..? అయితే వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకుని పరిహారం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం.

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. పీఎం కిసాన్ ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోండగా.. ప్రకృతి విపత్తులకు గురై రైతులు పంట నష్టపోయినప్పుడు ఆర్ధిక భద్రత కల్పించేందుకు పంట బీమా స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం పేరే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. రబీ, ఖరీఫ్ పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. తుఫాన్లు, వరదలు, వర్షాలు, భూకంపాలు, చీడ పురుగులు, జంతువుల దాడి లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తమ పంట నష్టపోతే వెంటనే పరిహారం పొందవచ్చు. తక్కువ ప్రీమియంతోనే ఎక్కవ పరిహారం లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునేందుకు ఏయే పత్రాలు అవసరం
ఆధార్ కార్డు, పంట సమాచారం, పట్టాదారు పాస్ బుక్‌లు, బ్యాంక్ పాస్ బుక్ వంటివి సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
-గూగుల్ ప్లే స్టోర్‌లో క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో ఉండే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
-అనంతరం మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
– మీ పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జిల్లా, మండలం, గ్రామం, బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయండి
-ఖరీఫ్ లేదా రబీ ఆప్షన్లను ఎంచుకోండి
-మీ భూమి, పంట వివరాలు నమోదు చేయండి
-అవసరమైన పత్రాలను సబ్‌మిట్ చేయండి
-మీ పంటను బట్టి ప్రీమియంను బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లించండి
-స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకుని మీ దగ్గర భద్రపర్చుకోండి
ప్రీమియం ఎంత..?
ప్రీమియం అనేది మీ పంటను బట్టి ఉంటుంది. ఒక్కొ పంటకు ఒక్కొలా ప్రీమియం, పంట బీమా అమౌంట్ అనేది ఉంటుంది. దీని ఆధారంగా మీరు నష్టపోయిన పంటను బట్టి పరిహారం అందిస్తారు. అన్నీ పంటలకు ఒకేలా పరిహారం ఉండదు. పంటను బట్టి నష్ట పరిహారం పరిమితి ఉంటుంది.
క్లెయిమ్ చేసుకోవడం ఎలా..?
-PMFBY చాట్ బాట్ నెంబర్ 7065514447కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ చేయండి
-ఆప్షన్లలో క్రాప్ లాస్ ఇంటిమేషన్ సెలక్ట్ చేసుకోండి
-రబీ లేదా ఖరీఫ్, సంవత్సరం సెలక్ట్ చేసుకోండి
-సర్వే నెంబర్ల ఆధారంగా మీ పంట వివరాలు సెలక్ట్ చేసుకోండి
-ఆ తర్వాత కారణాన్ని(తుఫాన్, వర్షాలు లేకపోవడం, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, చీడ పురుగులు, జంతువుల దాడి) ఎంచుకోవాలి
-అనంతరం తేదీ ఎంచుకోవాలి
-ఆ తర్వాత పంట నష్టపోయిన ఫొటోలను అప్ లోడ్ చేయాలి
-దీంతో విజయవంతంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసినట్లు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది
-అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చు
