మదురై తనిష్క్లో భారీ దోపిడీ..అంతా యూట్యూబర్ పనేనట..!
Madurai Tanishq Gold Heist: మధురైలోని తనిష్క్ జ్యువెలరీ షాపు భారీ దోపిడీ కేసులో యూట్యూబర్ నిశాంత్ ప్రధాన నిందితుడిగా తేలింది. 50 కోట్ల విలువైన నగలను కొల్లగొట్టిన ఈ దొంగతనంలో నిశాంత్ తన స్నేహితురాలు మీనాక్షి, తండ్రి సురేష్‌తో కలిసి పాల్గొన్నాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు. నిశాంత్ ఇంకా పరారీలో ఉన్నాడు.
మధురైలో సంచలనం రేపిన ప్రముఖ తనిష్క్ నగల దుకాణంలో బంగారం దోపిడీ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన దోపిడీ కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ భారీ దొంగతనం వెనుక ఒక యూట్యూబర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన నిశాంత్ కీలక సూత్రధారిగా ఉన్నాడని మధురై పోలీసులు ధృవీకరించారు. కేవలం 15 రోజుల క్రితం ప్రారంభమైన ఈ దుకాణం నుండి సుమారు 15 కిలోల బంగారం, విలువైన ఆభరణాలను దొంగిలించినట్లు తెలిసింది. దొంగిలించిన బంగారంలో సుమారు ఆరు నుంచి ఏడు కిలోల బంగారాన్ని నిశాంత్ తన స్నేహితురాలు మీనాక్షికి దాచిపెట్టమని ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు నిశాంత్ తండ్రి సురేష్‌ను, మీనాక్షిని అరెస్టు చేసి, గట్టిగా ప్రశ్నించగా, వారు బంగారాన్ని దాచిన ప్రదేశాన్ని వెల్లడించారు. ఊరి బయట పొదల మధ్య దాచిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు కొంత సొమ్మును రికవరీ చేసినప్పటికీ, ప్రధాన నిందితుడైన నిశాంత్ ఇంకా పరారీలో ఉన్నాడు. దోపిడీకి గురైన మొత్తం సొమ్ము, స్వాధీనం చేసుకున్న సొమ్ముపై స్పష్టత రావాల్సి ఉంది.
