Kakinada: రోడ్డుపై తళతళ మెరుస్తూ కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా..
కాకినాడలో ప్రైవేటు కళాశాల లెక్చరర్ సతీష్ తన నిజాయితీని చాటుకున్నారు. గాంధీనగర్‌లో ఓ మహిళ పోగొట్టుకున్న ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు గాజును ఆయనకు దొరికింది. వెంటనే పోలీసులను సంప్రదించి, ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో దానిని తిరిగి అప్పగించారు.

డబ్బు కనిపిస్తే చాలు.. సొంతం చేసుకోవాలని చూసే ఈ రోజుల్లోనూ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడో లెక్చరర్. రోడ్డుపై దొరికిన లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని చూసి ఆశపడలేదు. తనది కాని సొత్తును తన దగ్గర ఉంచుకోవడం తప్పని భావించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి.. ఆ నగను అసలు యజమానికి చేరేలా చేశాడు. కాకినాడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
కాకినాడలోని గాంధీనగర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో జయంతి అనే మహిళ రూ.5 లక్షల విలువైన బంగారు గాజును పోగొట్టుకున్నారు. విలువైన ఆభరణం కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, అదే బంగారు గాజు సతీష్ అనే ప్రైవేటు కళాశాల లెక్చరర్‌కు దొరికింది.
సాధారణంగా ఇలాంటి విలువైన వస్తువు దొరికితే కొందరు తమకెందుకు దొరికిందో అనుకుంటూ జేబులో వేసుకుంటారు. కానీ సతీష్ మాత్రం అలా చేయలేదు. ఆ బంగారు గాజు తనది కాదని భావించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించారు. అనంతరం ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో ఆ ఆభరణాన్ని అసలు యజమాని జయంతికి అప్పగించారు.
తనకు దొరికిన విలువైన ఆభరణాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి ఇచ్చిన సతీష్ నిజాయితీని ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు పోగొట్టుకున్న బంగారు గాజు తిరిగి చేతికి అందడంతో జయంతి ఆనందం వ్యక్తం చేశారు. సతీష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లక్షల విలువైన ఆభరణం కంటే.. అంతకంటే విలువైన తన నిజాయితీని చాటుకున్న సతీష్ ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నిజాయితీ ఇంకా బతికే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది!
