అరుణాచలేశ్వరుడి ఆలయంలో కార్తీక దీప వేడుకలు ప్రారంభం.. భరణి దీపం, మహా దీపం తేదీలు ఇవే!
Thiruvannamalai Thirukarthigai Deepam 2026: తమిళనాడులోని ప్రసిద్ధ తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో తిరుకార్తిగై దీపోత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో నవంబర్ 24న తెల్లవారుజామున భరణి దీపం, సాయంత్రం 2,668 అడుగుల ఎత్తైన కొండపై మహా దీపం వెలిగించనున్నారు. ఈ ఏడాది ఉత్సవ విశేషాలు తెలుసుకుందాం.

Thiruvannamalai Thirukarthigai Deepam 2026: తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో కొలువైన అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో తిరుకార్తిగై దీపోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2026 నవంబర్ 15న ఆలయంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం నిర్వహించడంతో పది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు వినాయకుడు, చండికేశ్వర స్వామివారు వెండి వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు.
అగ్ని రూపంలో దర్శనమిచ్చే అరుణాచలేశ్వరుడు హిందూ ధర్మంలో తిరువణ్ణామలై క్షేత్రానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పంచభూత క్షేత్రాల్లో ఇది అగ్ని లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పరమశివుడు అగ్ని స్వరూపంలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే తిరుకార్తిగై దీపోత్సవాన్ని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ఈ ఉత్సవాలకు ముందుగా నవంబర్ 12న క్షేత్రపాలకురాలైన దుర్గాదేవి వీధియులా నిర్వహించారు. నవంబర్ 13న పిడారి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవంబర్ 14న సంబంధ వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుడు వెండి మూషిక వాహనంపై, చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం అందించారు.
నవంబర్ 24న భరణి దీపం.. మహా దీపోత్సవం
పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రోజైన నవంబర్ 24 అత్యంత విశిష్టమైనది. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఆలయ గర్భగుడిలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండపై మహా దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు.
కొండ శిఖరంపై వెలిగించే ఈ మహా జ్యోతిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరువణ్ణామలైకి చేరుకుంటారు. మహా దీపం వెలిగిన సమయంలో అరుణాచల హరా.. శివ శివ అంటూ భక్తులు చేసే నామస్మరణతో ఆ క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.
కొండపైకి భక్తులకు అనుమతి నిరాకరణ
మహా దీపోత్సవం సందర్భంగా అరుణాచల కొండపైకి భక్తులు వెళ్లడంపై ఈ ఏడాది కూడా ఆంక్షలు విధించారు. నవంబర్ 24న దీపం వెలిగించే రోజున భక్తులకు కొండపైకి వెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ వందనా గార్గ్ ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మొత్తానికి పది రోజుల పాటు జరిగే తిరుకార్తిగై దీపోత్సవాలతో తిరువణ్ణామలై శివనామస్మరణతో మారుమోగనుంది. అరుణాచలేశ్వరుడి మహా జ్యోతిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




