Farming Ideas: 10 రోజుల్లో పంట చేతికి.. నెలలో మూడు కాపులు.. ఏడాది పొడవున ఆదాయం
వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేతికి రావాలని ప్రతి రైతు కోరుకుంటాడు. అలాంటి రైతులకు మెంతి కూర సాగు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది పంట వేసినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే కోతకు రావడం, ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం ఈ సాగులో ప్రత్యేకత. మరీ దీన్ని ఎలా సాగు చేయాలి.. ఈ సాగుతో నెలకు ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ చూద్దాం.

తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆదాయం వచ్చే పంటలు పండించాలని ప్రతి రైతు కోరుకుంటారు. అలాంటి రైతులకు మెంతి కూర సాగు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ మెంతుకూర సాగుతో సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు మెంతుకూర సాగు గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఆకుకూరల సాగులో దాదాపు 15 నుండి 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన, కేవలం 10 రోజుల్లోనే కోతకు వచ్చే మెంతి కూర సాగు విధానాలను వివరించారు.
మెంతి కూర సాగులో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎలాంటి రసాయన ఎరువులు గానీ, పురుగు మందులు గానీ వాడాల్సిన అవసరం లేదు. ఈ పంటకు పురుగుల బెడద ఉండదు కాబట్టి మందుల ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా, వినియోగదారులకు పూర్తి ఆరోగ్యకరమైన ఆకుకూర అందుబాటులోకి వస్తుంది.
విత్తన ఎంపిక నుండి కోత వరకు సాగు పద్ధతుల
విత్తనాలు: సాగు కోసం కిరాణా షాపుల్లో దొరికే చిన్న సైజు మెంతుల కంటే, విత్తన దుకాణాల్లో లభించే పెద్ద సైజు మెంతి విత్తనాలను ఎంచుకోవడం ఉత్తమమని రైతు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో విత్తనాల ధర సుమారు రూ.110 వరకు ఉంది. మీరు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.
విత్తే విధానం: మీరు విత్తనాలు వేయడానికి ముందు ట్రాక్టర్‌తో భూమిని 3 నుండి 4 సార్లు మెత్తగా దున్నుకోవాలి. విత్తనాలను చేతితో నేలపై దట్టంగా చల్లుకుని, ఆపై అర అంగుళం నుండి ఒక అంగుళం మందంతో మట్టిని కప్పాలి. దట్టంగా విత్తడం వల్ల మొక్కలు ఒకదానికొకటి ఆధారంగా ఉండి, కోత సమయంలో పీకి తీయడానికి ఎంతో సులువుగా ఉంటాయి.
నీటి పెట్టడం: ఈ పంట డ్రిప్ పద్ధతికి అనుకూలం కాదు. కాబట్టి మడుల పద్దతిలో దీనికి నీరు పెట్టాల్సి ఉంటుంది. నీరు పెట్టే సమయంలో ప్రతి మడ పూర్తిగా నిండేలా మూడు దశల్లో నీరు అందించాలి. విత్తనాలు చల్లి మట్టి కప్పిన వెంటనే మొదటిసారి, మొలకలు పైకి వచ్చి భూమి పగుళ్లు బారినప్పుడు రెండోసారి, కోతకు ఒక రోజు ముందు మూడోసారి నీరు పెట్టాలి. అంతే 10 రోజుల్లో మీకు పంచ చేతికి వస్తుంది. అయితే ఆ పంటను కత్తిరించకుండా చేతితో పీకాలి.
వ్యయం, ఆదాయం:
మీరు రెండు చిన్న మడులలో అంటే చిన్ని రూమ్ సైజ్ స్థలంలో సాగు చేయడానికి 4 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి, దీనికోసం మీకు అయ్యే ఖర్చు రూ.440, ఇక దున్నకం ఖర్చులు రూ.1000 అనుకున్న మొత్తం రూ.1400 అవ్వొచ్చు. సాధారణంగా రెండు మడల్లో మీకు 400 కట్టల వరకు దిగుబడి వస్తుంది.
అయితే, వర్షాకాలం (ఆఫ్-సీజన్) వంటి ప్రతికూల వాతావరణంలో దిగుబడి 200 నుండి 250 కట్టలకు తగ్గినప్పటికీ, మార్కెట్లో డిమాండ్ కారణంగా మీరు నేరుగా అమ్ముకుంటే కట్టకు రూ.10 చొప్పున ధర పలుకుతుంది. దీనివల్ల రెండు మడుల నుండి రూ.4000 వరకు ఆదాయం లభించి, ఖర్చులు పోను మీరు వేసే స్థలాన్ని బట్టి మీకు మంచి ఆదాయం వస్తుంది. ఇక శీతాకాలంలో దిగుబడి అధికంగా ఉండి, కట్ట రూ.8 చొప్పున విక్రయించినా రైతులకు మరింత మెరుగైన ఆదాయం సమకూరుతుంది.
సాగుకు అనుకూల కాలం
దీపావళి నుండి ఉగాది అంటే నవంబర్ నుండి మార్చి, ఏప్రిల్ వరకు ఉండే శీతాకాలం మెంతి కూర సాగుకు అత్యంత అనుకూలం. వర్షాకాలంలో పొలంలో నీరు నిలబడితే పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేసవి కాలంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి షేడ్ నెట్లను లేదా నీడ పట్టున సాగు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
