AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ నిండు ప్రాణం తీసిన చెంప దెబ్బ.. అసలేం జరిగిందంటే?

ఒక్క చెంపదెబ్బ ఒకే ఒక్క చెంపదెబ్బ.. ఓ నిండు ప్రాణం బలి కావడానికి కారణం అయింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు చేసిన పని ఓ కుటుంబాన్ని అనాథను చేసింది. చెంప దెబ్బ కొట్టాడని మద్యం మత్తులో జరిగిన ఓ చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. పగతో రగిలి.. ఓ వ్యక్తిని అంతమొందించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

Telangana: ఓ నిండు ప్రాణం తీసిన చెంప దెబ్బ.. అసలేం జరిగిందంటే?
Adilabad Slap Murder
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 3:44 PM

Share

ఓ చెంప దెబ్బ ఒకరి ప్రాణం పోవడానికి కారణమైందటే నమ్ముతారు.. అవును ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జైనథ్ మండలానికి చెందిన ఇప్ప ఈశ్వర్, తోయగూడకు చెందిన పెరిక తిరుపతి చిన్ననాటి స్నేహితులు. తిరుపతికి జైనథ్‌లో అత్తగారిల్లు ఉండటంతో తరచూ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం జైనథ్ బస్టాండ్ వద్ద కలుసుకున్న ఇద్దరు వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించారు. అనంతరం మరోసారి మద్యం తీసుకుని పత్తి చేనుకు సమీపంలోని రాళ్ల కట్టపై కూర్చొని మద్యం తాగుతున్నారు.

అదే సమయంలో అటుగా వస్తున్న గట్టు నారాయణ భుజం తిరుపతికి తగిలింది. దీంతో తిరుపతి అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నారాయణ తిరుపతి చెంప చెల్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ చెంపదెబ్బను తిరుపతి జీర్ణించుకోలేకపోయాడు. నారాయణపై పగ పెంచుకున్న తిరుపతి ఎలాగైనా నారాయణను మట్టుబెట్టాలని ఫిక్స్ అయ్యాడు. తన స్నేహితుడు ఈశ్వర్‌తో కలిసి అదే రాత్రి ఫ్లాన్ చేశారు. మరోసారి మద్యం కొనుగోలు చేసిన ఇద్దరు.. బైక్ బ్రేక్ కేబుల్ వైర్‌ను తీసుకుని నారాయణ కోసం వేచి చూశారు.

రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో నారాయణ జైనథ్ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరూ అతడిని వెంబడించారు. రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ వద్ద అదును చూసి అతడిని పత్తి చేనులోకి తోసుకెళ్లారు. ముఖం, పొట్టపై విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్ది.. ముందుగా సిద్ధం చేసుకున్న కేబుల్ వైర్‌తో మెడకు బిగించారు. ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు.

నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత అతడి జేబులోని నగదు, దోతితో పాటు హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు మరుసటి రోజు ఉదయం వరకు చేనులోనే ఉండి, ఆ తర్వాత నీరాల గ్రామానికి వెళ్లి మద్యం సేవించి బస్సులో తిరిగి జైనథ్ చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్‌తో పాటు నారాయణ దోతిని పందుల కోసం ఏర్పాటు చేసిన కూటురులో కాల్చివేసినట్లు విచారణలో వెల్లడించారు.

కాగా, ఈ కేసును సవాలుగా తీసుకున్న జైనథ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. ఇప్ప ఈశ్వర్ (38), పెరిక తిరుపతి (39)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్, కాల్చివేసిన దోతి అవశేషాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రావణ్ కుమార్ వెల్లడించారు.

ఒక్క చెంపదెబ్బ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపగా.. ఇద్దరిని హత్య కేసులో నిందితులుగా నిలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us