AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో సన్నబియ్యం రూ.100.. రేట్లు ఫిక్స్ చేసినా తగ్గని ధరలు.. మార్కెట్‌లో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కిలో సన్నబియ్యం ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావంతో సాగు తగ్గిందనే కారణంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ధరలు నిర్ణయించి, తనిఖీలు చేపట్టినా వినియోగదారులకు ఉపశమనం లభించడం లేదు. అసలు మార్కెట్‌లో ఏం జరుగుతోంది? మిల్లర్లు, రిటైలర్ల వాదనలేంటి? తెలుసుకుందాం.

కిలో సన్నబియ్యం రూ.100.. రేట్లు ఫిక్స్ చేసినా తగ్గని ధరలు.. మార్కెట్‌లో అసలేం జరుగుతోంది?
Telangana Rice Prices
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2026 | 7:23 AM

Share

సామాన్యుడి వంటింట్లో బియ్యం ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఎల్ నినో సాకుతో.. బడా వ్యాపారులు, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. రేట్లు కట్టడి చేసేందుకు సర్కారు రంగంలోకి దిగి ధరలు ఫిక్స్ చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అసలు బియ్యం మార్కెట్‌లో ఏం జరుగుతోంది?.. అనే వివరాలను తెలుసుకుందాం.. దేశానికి ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు బియ్యం ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. గత ఏడాది 92.17 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి ఎల్ నినో ప్రభావంతో 78.23 లక్షల ఎకరాలకే పరిమితం కావడం వల్ల దిగుబడిపై ప్రభావం పడింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పండే మన సన్న బియ్యానికి పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే, మార్కెట్‌లో ధాన్యం ధరలు తగ్గినా, నిల్వలు సమృద్ధిగా ఉన్నా.. బియ్యం ధరలు మాత్రం ఇంకా దిగిరావడం లేదు. ప్రస్తుతం కిలో సన్నబియ్యం రూ.85 నుంచి రూ.100 పలుకుతుండటంతో వంటింటి బడ్జెట్ అంతా బియ్యానికే సరిపోతోందని జనం వాపోతున్నారు.

బీపీటీ, కేఎన్‌ఎం కిలో రూ. 66

ఎల్ నినో సాకుతో బడా వ్యాపారులు, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ దాడులు ముమ్మరం చేసి.. సన్నబియ్యంపై మూడు కేటగిరీలుగా MRP ఫిక్స్ చేసింది. బీపీటీ, కేఎన్‌ఎం.. కిలో రూ. 66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా.. కిలో రూ. 74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్, జైశ్రీరామ్.. కిలో రూ. 79గా నిర్ణయించింది. నిబంధనలు దాటితే నిత్యావసర వస్తువుల చట్టం కింద పీడీ యాక్ట్ పెడతామని సర్కారు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో తొలిసారిగా మిర్యాలగూడలో మిల్లర్ల సహకారంతో మిల్లుల్లోనే 70 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ధరలకే బియ్యం అందించేందుకు ఈ రిటైల్ కౌంటర్లు తెరిచామని, త్వరలో జిల్లా అంతటా విస్తరిస్తామని మిల్లర్లు చెబుతున్నారు.

దోపిడీని అరికట్టేందుకు ప్రైస్ మానిటరింగ్ సెల్

మధ్యవర్తుల దోపిడీని అరికట్టేందుకు జిల్లా అధికరులు ప్రైస్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఇండెంట్ ఇస్తే మిల్లర్ల నుంచి నేరుగా నిల్వలు ఇప్పిస్తామని, వదంతులు నమ్మి ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ హెచ్చరించారు.

బియ్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సర్కారు ప్రకటించిన ధరలకు నాణ్యమైన బియ్యం ఎక్కడా దొరకడం లేదని వినియోగదారులు అంటున్నారు.

ప్రభుత్వ ధరలకు అమ్మలేక షాపులు మూసేస్తున్న రిటైలర్లు

నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని మిల్లర్లు ఎక్కువ రేటుకు అమ్ముతుండటంతో, తాము ప్రభుత్వ ధరలకు అమ్మలేక షాపులు మూసేస్తున్నామని రిటైలర్లు అంటున్నారు. మరోవైపు మిల్లర్లు నాన్-బీపీటీ బియ్యాన్ని సన్నబియ్యం పేరుతో ప్రభుత్వ ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీడీ యాక్ట్ పెడతామని సర్కారు హెచ్చరిస్తున్నా.. సామాన్యుడికి మాత్రం ఉపశమనం దక్కడం లేదు. మరి క్షేత్రస్థాయిలో ఈ బియ్యం మంటలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us