Telangana: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులపై కీలక చర్చ
తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రను ఒప్పించాలని.. ఎల్‌నినో కరువు పరిస్థితులు, భూగర్భ జలాల పరిరక్షణకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనుల పురోగతి, వాటికి అవసరమైన అనుమతులు, నిధుల వివరాలను ప్రధానికి సమగ్రంగా వివరించారు. ప్రధాని మోదీతో సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగోను ఆవిష్కరించడంతోపాటు.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలోఇండియా గేమ్స్ కు ఆహ్వానించడంతో పాటు తెలంగాణలో ఎల్ నినో కరువు పరిస్థితులు, రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం. నీటి ప్రాజెక్టులకు అనుమతులపై సుదీర్ఘంగా ప్రధానితో చర్చించారు
పర్యావరణ అనుమతుల్లో జాప్యం తొలగించాలి
పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.50 వేల కోట్లు వెచ్చించాయి. సుప్రీంకోర్టు స్టే సహా పలు కారణాలతో ఏళ్ల తరబడి పనులు మందగించాయి. దరఖాస్తులు స్వీకరించి పర్యావరణ అంచనా చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖలో దరఖాస్తుల పరిశీలన నెలల తరబడి ఆలస్యమవుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధానిని కోరాం. దేశవ్యాప్తంగా అనుమతుల జాప్యంతో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశామని ఉత్తమ్ చెప్పారు.
తుమ్మిడిహట్టిపై ప్రతిపాదన
తుమ్మిడిహట్టి వద్ద గతంలో 148 మీటర్లకు ఒప్పందం కుదిరింది. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 152 మీటర్లకు పెంచాల్సిన అవసరాన్ని పటాలు, గణాంకాలతో ప్రధానికి వివరించాం. ఈ విషయమై ప్రధానికి గతంలో రాసిన లేఖపై ఆయన కార్యాలయం సూచన మేరకు కేంద్ర జల సంఘం సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ముంబయి వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. మహారాష్ట్ర అంగీకారం సాధించేందుకు ప్రధాని చొరవ కోరాం. అదనపు ముంపునకు కేంద్రం లేదా మహారాష్ట్ర నిర్ణయించే మేర పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
సమ్మక్క–సారలమ్మ ఎన్ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటి
సమ్మక్క–సారలమ్మ ఎన్ఓసీపై 17తేదీ ఛత్తీస్‌గఢ్ సీఎంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి కానున్నారు. సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, హైడ్రాలజీ అనుమతి కూడా వచ్చిందని ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీని పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ జారీని వేగవంతం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ కోరిన మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ముంపు నివేదిక తెప్పించామన్నారు.
అదనపు డీపీఆర్ కోసం కోరిన సొమ్ము జమ చేశామనీ ముంపునకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికే తెలిపామని వివరించారు. సమ్మక్క–సారలమ్మ డీపీఆర్‌ను సమర్పించిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ అనుమతికి సంబంధించిన మార్గదర్శకాలు మారాయి. డీపీఆర్ సమర్పించినప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే దాన్ని పరిశీలించాలని కోరారు..రేపు కేంద్ర జల సంఘం చైర్మన్‌ను కలవనున్నారు
అలాగే 2027–28 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్లు కోరామని ఉత్తమ్ వెల్లడించారు. సీతమ్మసాగర్–సీతారామ సమీకృత ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరానికి రూ.178 కోట్లు, చనాకా–కొరాట బ్యారేజీకి రూ.103 కోట్ల కోసం కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.
రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల మేర 50 ఏళ్ల వడ్డీలేని రుణాలను ప్రకటించింది. తెలంగాణకు ఇప్పటివరకు రూ.1,457 కోట్లు అందాయి. రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల తుది పనులకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేసి విడుదల చేయాలని కోరాం. నిధులు అందితే 2027 మార్చి 31లోగా వినియోగించగలం. ఏడాదిలోగా కొత్త ఆయకట్టుకు నీరందించి, ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించగలమని మంత్రి అన్నారు.
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక సాయం
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావం, పలు జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న తీరును గణాంకాలతో ప్రధానికి వివరించామని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర భూగర్భ జల మండలి 2026 సెప్టెంబర్ నివేదికతో పాటు అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు, పరిరక్షించేందుకు రూపొందించిన స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణను అందజేశామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి రూ.5,000 కోట్ల ప్రత్యేక కేంద్ర ఆర్థిక సాయం కోరినట్లు వెల్లడించారు.వచ్చే వానాకాలం వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని రిజర్వాయర్లలో నిల్వ ఉంచాం. ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రధాని ప్రతి అంశాన్నీ ఓపికగా విని, వివరాలు అడిగి తెలుసుకున్నారని, రాష్ట్ర విజ్ఞప్తులను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని నిపుణులు స్పష్టంగా చెప్పారని మంత్రి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే రకమైన సీకెంట్ పైల్ పునాదులు ఉన్నాయి. పునాదుల రూపకల్పనలో, నిర్మాణంలో లోపాలను నిపుణులు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని రూపకల్పన చేసి నిర్మించిన గత ప్రభుత్వ హయాంలోనే అది దెబ్బతింది. ఇప్పుడు అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరడం అర్థరహితమని ఉత్తమ్ అన్నారు.
ప్రాణహిత–చేవెళ్లకు రూ.11 వేల కోట్లు వెచ్చించి 30 శాతం పనులు పూర్తయ్యాక తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించారని ఉత్తమ్ చెప్పారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ఈ మార్పు చేసిందని ఆరోపించారు. దిగువకు ప్రవహిస్తున్న గోదావరి జలాలను ప్రస్తుతం దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్నామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
