కార్తీక మాసం..తొలి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
పవిత్రమైన కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదులు, పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠగోదావరి నదిలోనూ, పాలకొల్లు క్షీరారామ క్షేత్రంలోనూ భక్తుల తాకిడి భారీగా కనిపిస్తోంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రి పుష్కర ఘాట్లలోనూ భక్తులు పెద్దఎత్తున నదీ స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివాలయాలన్నీ శివయ్య నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

హిందూ ధర్మంలో కార్తీకమాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసపు మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదులకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక శోభ
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నరసాపురం వశిష్ఠ గోదావరి నదిలో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. క్షీర రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి.
అలాగే రాజమండ్రిలోనూ కార్తీక శోభ సంతరించుకుంది. గోదావరి పుష్కర ఘాట్‌లు భక్తులతో కళకళలాడుతున్నాయి. కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న కోటిలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు, ఉమామార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో భారీ రద్దీ
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు. మహాక్షేత్రం భక్తుల రద్దీతో పూర్తిగా సందడిగా మారింది. నిన్న ఒక్కరోజే స్వామి అమ్మవార్లను 48,557 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా, ఈనెల 24న శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ఘనంగా కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కార్తీక తొలి సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ దీపాల కాంతులతో, వేదమంత్రోచ్ఛారణలతో దివ్యసౌందర్యాన్ని సంతరించుకున్నాయి. ప్రతి శివాలయం వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తోంది. శివ భక్తులు ఈ పవిత్ర మాసంలో నియమనిష్టలతో పూజలు చేస్తూ దైవకృపను పొందుతున్నారు.




