Andhra News: కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిని ఓదార్చిన కొండముచ్చు
మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో పక్కింటి వాడికి ఆపద వచ్చి అలోమని ఏడుస్తున్నా పక్కనుంచి వెళ్లిపోయేవాళ్లే కానీ.. ఆప్యాయంగా పలకరించి ఓదార్చే వాళ్లే కరువైపోతున్నారు. కానీ, ప్రమాదంలో తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో బాధపడుతున్న ఓ తల్లిని ఓ మూగజీవి ఓదార్చుతూ, కన్నీళ్ళు తుడిచింది. నీ బిడ్డ అల్లరిని నాలో చూసుకో అన్నట్టుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

శివరాత్రి రోజు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ధ గోదావరిలో కొందరు యువకులు పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఈ ఘటనలో తిరుమల శెట్టి పవన్ , పడాల దుర్గాప్రసాద్ , అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిలు మృత్యువాతపడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందటంతో బాధిత కుటుంబాలు తీవ్రవిషాదంలో మునిగి పోయాయి. ఈ ఐదుగురు యువకులకు మార్చి 8 శనివారం రోజు పెదకార్యం నిర్వహించారు వారి కుటుంబ సభ్యులు. ఈ సమయంలో అనిసెట్టి పవన్ ఇంటికి.. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ కొండముచ్చు వచ్చింది. పవన్ మృతితో విషాదం లో ఉన్న అతడి తల్లి వద్దకు చేరుకొని ఆమె చుట్టూ తిరిగి ఓదార్చింది. ఆమెను ఏడవద్దంటూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది. ఈ ఘటనతో అక్కడ వున్న బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనను అక్కడున్నవారు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. మనిషిలో మానవత్వం మరుగున పడుతున్న సమయంలో జంతువులు మనుషులకు అండగా నిలుస్తున్నాయేమో అంటూ చర్చించుకున్నారు. ఆ కొండముచ్చు.. ఆ తల్లిని ఓదార్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
