- Telugu News Photo Gallery Political photos Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy's Development Spree: 105 Projects Launched in a Day
Kotamreddy Sridhar Reddy: ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన! దేశ చరిత్రలోనే తొలిసారి..
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒకేరోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. స్థానిక ప్రజల చేతనే శంకుస్థాపనలు చేయించడం ఆయన వినూత్న విధానం. 60 రోజుల్లో 303 పనులను పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు 191 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన కృషిని ప్రశంసించారు.
SN Pasha |
Updated on: Mar 09, 2025 | 1:25 PM

నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే కల సాకారం చేసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనుల విషయంలోనూ భిన్నంగా వెళుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కానీ ఆయన మాత్రం వినూత్నంగా చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నిత్యం ప్రజాబాట, ప్రజాసమస్యలపై పోరాటాలు, అధికార పక్షంలోనే విపక్ష ఎమ్మెల్యేలా వ్యవహరించడం ఆయన తీరు.

నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులు కోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంలో జిల్లాలో కోటంరెడ్డి తర్వాతే ఎవరైనా. గడిచిన పదేళ్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం అలా ఉంటే తాజాగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత తీరు మరింత భిన్నంగా ఉందన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో, కోటంరెడ్డి ఎంచుకున్న విధానం ఆసక్తికరంగా మారింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం 191 కోట్లతో పనుల కోసం నిధులు మంజూరు చేయించుకున్న కోటంరెడ్డి, ఒకేరోజు ఏకంగా 105 పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అది కూడా నాయకుల చేత కాకుండా స్థానిక ప్రజలచేత శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 60 రోజుల్లో మొత్తం 303 పనులను పూర్తి చేసి 606 మంది పార్టీలోని కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయించేలా నిర్ణయించారట.

ఈ రికార్డు స్థాయి శంకుస్థాపనలపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. "నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారు. బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను." అంటూ లోకేష్ ట్వీట్‌చేశారు.

అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్లాన్ చేసిన ఎమ్మెల్యేగా కోటంరెడ్డి నిర్ణయం వెనుక అసలు వ్యూహం మరోటి ఉందా..? అందుకే చర్చల్లో ఉండేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు సార్లు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు.. ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పోటీ చేయించాలని చూస్తున్నారు.. అందుకోసం తమ్ముడి చేత "ఇంటింటికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి" పేరుతో నాలుగేళ్ల ముందే కార్యక్రమం మొదలు పెట్టడం.. ఇప్పుడు ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాల జోరు చూస్తుంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా గెలవడానికి రాళ్లబాటపై నడిచిన కోటంరెడ్డి తమ్ముడి కోసం పూల బాట వేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.





























